Corporators: అనంతపురం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు స్టడీ టూర్‌కు సిద్ధమయ్యాయి. ఇందోర్, ఆగ్రా, దిల్లీ నగరాలతో అనంతపురం నగరానికి ఏమాత్రం పోలిక లేకపోయినా.. ఆయా చోట్ల పర్యటనకు వెళ్తున్నారు. అనంత నగరపాలక సంస్థలో కేవలం 3లక్షల 31వేల జనాభా ఉన్నారు. కానీ 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలలో ఘన వ్యర్థాల నిర్వహణను పరిశీలించటానికి కార్పొరేటర్లు, అధికారులు పర్యటన పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది.
ఒక్కో కార్పొరేటర్‌కు నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుంచి 52వేల777 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 50 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కోఆప్షన్ సభ్యులతో పాటు 9మంది అధికారులు, వీరికి సేవలు అందించే సిబ్బంది ఈ యాత్రకు వెళ్తున్నారు. దాదాపు 40 లక్షల రూపాయలు ఈ యాత్రకు ఖర్చుచేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు.. మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మట్టి ఖర్చు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారని కార్మికుల కుటుంబసభ్యులు వాపోతున్నారు.