దేశంలోని ఎన్నో రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యం కరవుతో కొట్టుమిట్టాడే అనంతపురం జిల్లాను ఆదుకుంటోన్న జీన్స్ పరిశ్రమపైనా ఈ వైరస్ పంజా విసిరింది. తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయదుర్గంలో దాదాపు రెండువేల జీన్స్ పరిశ్రమలు ఉన్నాయి. ఇవి రోజూ 50 వేల నుంచి లక్ష మేర జీన్స్ దుస్తులను ఉత్పత్తి చేస్తున్నాయి. జీన్స్ ప్యాంట్లకు వినియోగించే దారం, గుండీలు, జిప్లును పూర్తిస్థాయిలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ప్యాంట్లకు బ్లీచింగ్ వాష్‌లో వినియోగించే కొన్ని రకాల రసాయనాలు కూడా చైనా నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్నారు. వీటినే భారత్‌లో కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడతో పోలిస్తే సగం ధరకే చైనా అందిస్తుండటంతో రాయదుర్గం జీన్స్ పరిశ్రమలన్నీ ఆ దేశానికి చెందిన వస్తువులనే వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో చైనాలో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ కారణంగా జనవరి 15 నుంచి ఆ దేశం రసాయనాలు, ఇతర గార్మెంట్‌లో వినియోగించే వస్తువుల ఎగుమతిని నిలిపివేసింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని జీన్స్ పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టాల మీద కష్టాలు
ప్రఖ్యాతి గడించిన రాయదుర్గం జీన్స్ పరిశ్రమ వరుస దెబ్బలతో కుదేలైపోతోంది. పదేళ్ల క్రితం విద్యుత్ కోతలతో తీవ్ర నష్టాలపాలైంది. అనంతరం వచ్చిన ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా చేసి పారిశ్రామిక వేత్తలకు అండగా నిలిచింది. కష్టాలు గట్టెక్కి గాడిలో పడుతున్నామని భావిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మరోసారి జీన్స్ మార్కెట్‌ను కుదేలు చేసింది. అనంతరం నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో జీఎస్టీ ఇబ్బందులను తెచ్చిపెట్టిందని వ్యాపారులు అప్పట్లో ఆవేదన చెందారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తెప్పించుకునే జీన్స్ క్లాత్ బేళ్ల ధరలు అమాంతం పెరిగి, ఆ ప్రభావం భారంగా మారింది. ఇవన్నీ ఎలాగోలా తట్టుకొని ముందుకు వెళుతున్న సమయంలో చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటం, అక్కడ అన్ని పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోవటంతో ఇక్కడి జీన్స్ పరిశ్రమకు గడ్డు కాలం ఏర్పడింది.
10వేల మందికి ఉపాధి