అనంతపురం జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఆ క్రమంలో తగ్గట్టు పరీక్షలు నిర్వహించడం లేదు. కొవిడ్ పరీక్షల ఫలితాల వెల్లడిలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఫలితం ఆలస్యం కావడం వల్ల వైరస్ మరింత వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఫలితాలు రావడానికి 3 నుంచి 7 రోజులు పడుతోందని చెబుతున్నారు.
ఒక్కటే ల్యాబ్..
అనంతపురం జిల్లా మొత్తానికి కలిపి.. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబ్ ఉంది. దీంతో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను ఇక్కడికే తరలించాల్సి వస్తుంది. నమూనాల ఫలితాలు వెల్లడించేందుకు సిబ్బంది 3 షిప్టుల్లో పనిచేస్తున్నారు.