ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 23, 2020, 10:25 AM IST

ETV Bharat / state

కరోనా ఉందన్నా.. పరీక్షలు నిర్వహించారు.. తీరా చూస్తే!

నేపాల్ నుంచి వచ్చిన యువకులకు కరోనా ఉందనే పుకారు... ఆ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. చివరికి పోలీసులు, వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించి ఆ లక్షణాలు లేవని నిర్ధరించిన తర్వాతే.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వారందర్నీ గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

villagers afraid about nepal return youth
నేపాల్ నుంచి వచ్చిన యువకులకు వైద్య పరీక్షలు

నేపాల్ నుంచి వచ్చిన యువకులకు వైద్య పరీక్షలు

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు నేపాల్​లో ఉపాధి కోసం వెళ్లారు. అక్కడ పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా.. నాలుగు రోజు క్రితం నేపాల్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. అక్కడ నుంచి మడకశిరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, గ్రామానికి చేరుకున్నారు. వీరికి కరోనా సోకటంతోనే అక్కడ నుంచి వచ్చేశారనే పుకార్లు గ్రామస్తులను ఆందోళనకు గురి చేశాయి.

సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్, వైద్యాధికారిణి డాక్టర్ నీరజ, ఎంపీడీవో రాజగోపాల్, ఆరోగ్య సిబ్బంది... సదరు గ్రామానికి చేరుకొని, యువకులను విచారించారు. తమకు సరిహద్దులోనే కరోనా పరీక్షలు నిర్వహించారని, ఎటువంటి లక్షణాలు లేవని నిర్ధరించారని యువకులు తెలిపారు. ముందు జాగ్రత్తగా వైద్యాధికారిణి మరలా వైద్య పరీక్షలు నిర్వహించగా, కొవిడ్ 19 మహమ్మారి లక్షణాలు కన్పించకపోవటంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయినా.. వారందరినీ 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు గ్రామాలకు చెందిన యువకులు నేపాల్ నుంచి వచ్చారనీ, వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని నోటీసులు జారీ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆదేశాలు బేఖాతరు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరిశుభ్రత చర్యలు

ABOUT THE AUTHOR

...view details