ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాని నిర్లక్ష్యంగా వదిలేస్తే... కబళిస్తుంది..! - అనంతపురం జిల్లాలో కరోనా మరణాలు వార్తలు

కరోనా తగ్గింది కదా అని ప్రజలు ఇష్టం వచ్చినట్లు నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నారు. అనంతపురం జిల్లాలో కోవిడ్ వచ్చి ఇప్పటికి 248 రోజులయ్యిందని అధికారులు తెలిపారు. వైరస్ ఇంకా వ్యాప్తిచెందుతోందని..ప్రజలు ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ రెండు నెలలు చాలా కీలకమైనవి..అందుకే ప్రజలంతా వ్యాక్సిన్ వచ్చేదాకా జాగ్రత్తలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ గణనీయంగా తగ్గినా...నిర్లక్ష్యం వల్ల మళ్లీ విజృంభించోచ్చు. మాస్కులు ధరిస్తూ..కోవిడ్​ కట్టడిలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు.

corona in anantapur district
అనంతపురం జిల్లాలో కరోనా కేసులు

By

Published : Dec 2, 2020, 10:00 AM IST

‘కరోనా’ మహమ్మారి అన్ని విధాలా అలజడి సృష్టించింది. మానవాళి మనుగడకే సవాల్‌ విసిరింది. ఈ మహమ్మారిని యావత్తు ప్రజానీకం ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది... ఇంకా దీని బారిన నుంచి పూర్తిగా గట్టెక్కలేదు. గడిచిన ఎనిమిది నెలలు తీవ్ర గడ్డు పరిస్థితులను అనుభవించారు. చాలా మంది జీవితాలు తారుమారు అయ్యాయి. పగవాడికి కూడా ఈ దుస్థితి రాకూడదని వేడుకున్నారు. ఇదే మాదిరే రానున్న రెండు నెలలు సైతం ఎంతో కీలకం. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే దాకా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గడిచిన నెలలతో పోలిస్తే కరోనా మహమ్మారి గణనీయంగా తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే. గతంలో ప్రతి వందలో 21 మందికి సోకిన ఈ వైరస్‌... ఇప్పుడు ఒక శాతం లోపే నమోదు అవుతోంది. పరీక్షలు పెరిగినా కేసుల నమోదు తగ్గింది. ఇక ఏమీ కాదులే అన్న భావన.. నిర్లక్ష్యం చాలా మందిలో గూడు కట్టుకుంది. ఈ అభిప్రాయం సరికాదని ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది.

వైరస్‌కు 248 రోజులు

కొవిడ్‌ మహమ్మారి అనంతపురం జిల్లాలో తెరపై వచ్చి ఇప్పటి సరిగ్గా 248 రోజులైంది. ఈ ఏడాది మార్చి 29న ప్రథమంగా రెండు కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది నెలలు గడిచాయి. మార్చి మూడు రోజుల్లో 280 మందికి పరీక్షలు చేస్తే ఇద్దరికి వైరస్‌ తేలింది. 0.71 పాజిటివిటీ రేటు నెలకుంది. ఏప్రిల్‌ నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. జూన్‌లో ఏకంగా 4.71 శాతం పాజిటివిటీ వచ్చింది. జులైలో 16.18 శాతం కాగా.. ఒక్కసారిగా ఆగస్టులో 18.36 శాతం నమోదైంది. జూన్‌ నుంచి సెప్టెంబరు దాకా జిల్లా ప్రజలు చివురుటాకుల్లా వణికిపోయారు. ఈ వైరస్‌ ఎక్కడ ప్రబలుతుందో ఏమోనన్న భయంతో ఆందోళన చెందారు. అక్టోబరులో 4.15 శాతానికి తగ్గింది. నవంబరులో ఏకంగా ఒక శాతం మాత్రమే పాజిటివిటీ రేటు నమోదు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మాస్కే స్వీయ రక్షణ

బయటకు అడుగు పెడితే ఆ మూడును విధిగా పాటించాలి. మాస్కు తప్పనిసరిగా ధరించాలి. శానిటైజర్‌ దగ్గర పెట్టుకుని అవసరమైనపుడు వాడాలి. ప్రతి చోటా భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలి. ఈ మూడుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలే కాదు.. ప్రైవేట్‌, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు.. ఇలా అన్ని చోట్లా విధిగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను మరో రెండు నెలలు తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే ఆ మహమ్మారి నుంచి పూర్తిగా గట్టెక్కడానికి అవకాశం ఉంది. మరో వైపు.. కరోనా నిర్మూలన కోసం యావత్తు జిల్లా అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమించింది. అటు వైద్య సిబ్బంది, ఇటు ఇతర అధికారులు కఠోరంగా కృషి చేశారు.

మరణాలు తగ్గుముఖం

జులై నుంచి అక్టోబరు దాకా కొన్ని రోజులు వందకుపైగానే పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నవంబరులో ద్వితీయ సంఖ్యలోనే వచ్చాయి. మూడు రోజులు ఏక సంఖ్య సైతం లేకపోలేదు. ఇక మరణాల విషయానికి వస్తే... గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. కొన్ని రోజులు మృతులు ఉండటం లేదు. ఇది చాలా శుభ పరిణామం. జులై, ఆగస్టు, సెప్టెంబరులో రోజుకు ఐదారు కూడా వచ్చాయి. కొన్ని రోజులైతే పది నుంచి 13 దాకా మృతులు ఉన్నారు. పిట్టల్లా రాలిపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం సైతం ఆందోళన చెందింది. జూన్‌ దాకా కేవలం ఎనిమిదే. జులైలో 106, ఆగస్టులో 216కు పెరిగాయి. సెప్టెంబరులో 157కు తగ్గాయి. అక్టోబరులో 73కు తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. నవంబరులో కేసులే కాదు... మరణాలూ తగ్గాయి

రాష్ట్రంలో ఐదో స్థానం

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 66,709 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క మంగళవారమే కొత్తగా 18 నమోదు కాగా ఒకరు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 590కి చేరింది. పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 65,904 మంది ఉన్నారు. ప్రస్తుతం 215 మంది వైద్య చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రస్థాయిలో అన్నింటిలోనూ జిల్లా ఐదో స్థానంలో ఉంది. కేసుల నమోదు, మరణాలు, కోలుకున్న వారి సంఖ్య.. ఇలా అన్నింటిలోనూ ఐదో స్థానంలో ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల తర్వాత అనంత ఉంది.

ఇదీ చూడండి.పీల్చే గాలే శత్రువు...కాలుష్యమే ప్రాణాంతకం

ABOUT THE AUTHOR

...view details