'కొవిడ్ ఆసుపత్రుల నిర్వహణ చేతకాకపోతే వదిలేసి వెళ్లిపోండి' - corona hospitals in ananthapuram district news
కరోనా వేళ తమ ఆధీనంలోకి తీసుకున్న ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేక పోతోందని అనంత జిల్లా ప్రైవేట్ నర్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కొండయ్య అన్నారు. నిర్వహణ చేయగలిగితేనే అసుపత్రుల్లో రోగులను ఉంచాలని లేకుంటే ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతోందని అనంతపురం జిల్లా ప్రైవేటు నర్సింగ్ అసోషియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కొండయ్య అన్నారు. నగరంలోని తమ నర్సింగ్ హోంను కొవిడ్ ఆసుపత్రిగా మార్చటాన్ని వ్యతిరేకించినా.. ప్రభుత్వం వినకుండా ఈనెల 22న ఉన్నపళంంగా ఆసుపత్రిని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఆ రోజు నుంచే నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. రోగులకు, వైద్యులకు వాడిన పీపీఈ కిట్లు, గ్లౌజ్, ఆహార పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని.. దీనివలన వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్ ఆసుపత్రిగా మార్చిన నర్సింగ్ హోంలో రోజుకు ఒకసారి పారిశుద్ధ్య పనులు కూడా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ సరిగా లేకపోతే.. వైరస్ చుట్టుప్రక్కలవారికి సోకే ప్రమాదం ఉందని కొండయ్య హెచ్చరించారు.