ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముప్పు ముందుంది..నిర్లక్ష్యం ముదిరింది ! - anantapuram latest news '

రెండో ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన క్రమంలో 300 పడకల సామర్థ్యం ఉన్న తాత్కాలిక ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. మూడో ఉద్ధృతి మొదలయ్యే ప్రమాద పరిస్థితుల్లో తొలగించడం పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు నెలల ఒప్పంద గడువుతో రూ.2.7కోట్లతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం విచారకరం. జిల్లా అధికార యంత్రాంగం నుంచి పొడిగింపు ఉత్తర్వు లేకపోవడంతో సంబంధిత గుత్తేదారు గుట్టుచప్పుడు కాకుండా ఆ ఆస్పత్రి సామగ్రిని తరలించారు. ముందుచూపు లేకుండా తొలగించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

corona hospital removed in ananapuram district
corona hospital removed in ananapuram district

By

Published : Aug 9, 2021, 10:36 AM IST

కరోనా మూడో ఉద్ధృతి ఉందని ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రమాద పరిస్థితులు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం దృష్టిసారించలేదనటానికి ఇదో ఉదాహరణ. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన జర్మనీ హ్యాంగర్‌ ఆస్పత్రిని తొలగించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

నిధులు వృథా..

రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షణలో హైదరాబాద్‌కు చెందిన అవెన్స్‌ కంపెనీ సారథ్యంలో ఈ ఏడాది మే 11 నుంచి 23 మధ్యలోనే 300 పడకలతో జర్మన్‌ హ్యాంగర్‌ విధానంలో తాత్కాలిక ఆస్పత్రిని రూ.2.7కోట్ల వ్యయంతో నిర్మించారు. దీన్ని తొలగించటంతో ఈ నిధులన్నీ వృథాగా మారాయి. తాత్కాలిక ఆస్పత్రిని మే 23వ తేదీన జిల్లా అధికార యంత్రాంగానికి అప్పగించారు. జూన్‌ ఒకటో తేదీన లాంఛనంగా ప్రారంభించారు. జులై 23వ తేదీతో ఒప్పంద గడువు ముగిసింది. ఈ మధ్య కాలంలో 400 మందికిపైగా రోగులు ఆ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందారు. గడువు పొడిగిస్తారన్న ఉద్దేశంతో జులై ఆఖరు దాకా సదరు గుత్తేదారుడు వేచి చూశారు. అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచే తొలగింపు మొదలుపెట్టారు. మరో వైపు... సదరు గుత్తేదారుకు ఇప్పటి దాకా నయాపైసా కూడా బిల్లు రానట్లు తెలుస్తోంది.

‘సర్వజన’కు వైద్య సిబ్బంది

తాత్కాలిక ఆస్పత్రిలో పని చేసేందుకు మే నెలలోనే ప్రత్యేక నియామకాలతో 300 పడకలకు అవసరమైన సిబ్బందిని తీసుకున్నారు. మూడు షిఫ్టుల్లో పని చేసేలా నిబంధన విధించారు. స్టాఫ్‌నర్సు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ కేడర్లకు సంబంధించి మాత్రమే కొత్త నియామకం చేపట్టారు. డాక్టర్లు, ఇతర సాంకేతిక విభాగాల వారికి జనరల్‌ ఆస్పత్రి, డీఎంహెచ్‌ఓ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై నియమించారు. ఇపుడు వీరంతా వారి సొంత విధుల్లోకి వెళ్లారు. తాత్కాలిక నియామక సిబ్బందిని మాత్రం సర్వజనాస్పత్రికి బదలాయించారు. స్టాఫ్‌నర్సులు 18, ఎఫ్‌ఎన్‌ఓలు 17, ఎంఎన్‌ఓలు 25 మంది ప్రకారం ఉన్నారు. వీరికి మొదటి నుంచి వేతనాలు చెల్లించలేదు.

శాశ్వత నిర్మాణాల పరిస్థితి..?

ఈ తాత్కాలిక ఆసుపత్రి ప్రాంగణంలోనే ప్రభుత్వ నిధులతో 45 మరుగుదొడ్లు శాశ్వత ప్రాతిపదికపై నిర్మించారు. అపుడే తలుపులు ఊడిపోయాయి. 63వేల చదరపు అడుగుల స్థలంలో రెండు ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. 200 పడకలతో ఒకటి, వంద పడకలతో మరొకటి పక్కపక్కనే ఏర్పాటు చేశారు. ఒక్కో చదరపు అడుగు రూ.160 ప్రకారం సదరు కంపెనీకి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.

తాడిపత్రిలో కొనసాగింపు..!

తాడిపత్రిలోని ఆర్జాస్‌ స్టీల్‌ కర్మాగారం వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. సేవలకు, ఏర్పాట్లకు ఎలాంటి ఢోకా లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. రూ.2 కోట్లతో 500 పడకలతో ఇక్కడ ఏర్పాటు చేశారు. తాడిపత్రి పరిసరాల్లో అర్జాస్‌ పరిశ్రమ నుంచి ఆక్సిజన్‌ అందించేందుకు అనుకూలంగా ఉండటం, మూడు జిల్లాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కోవిడ్‌ కేర్‌ కేంద్రంలో ప్రస్తుతం 11 మంది రోజులు వైద్య సేవలు పొందుతున్నారు. 33 మంది వైద్యులు, వైద్య సిబ్బంది ప్రస్తుతం వైద్యసేవలు అందిస్తున్నారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులు

తాత్కాలిక ఆస్పత్రి

ఇదీ చదవండి:BC Welfare: బీసీల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నాం: మంత్రి గోపాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details