అనంతపురం నగరంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ముప్పైవేల మందికి పైగా వైరస్ బారినపడగా.. అనంత నగరంలో మాత్రమే 20 వేల వరకు బాధితులు ఉంటారనే అంచనా ఉంది. సోమవారం విడుదల చేసిన కరోనా బులెటిన్ లో జిల్లా వ్యాప్తంగా 535 మందికి కొత్తగా వైరస్ సోకగా.. వీరిలో నగరానికి చెందిన వారే 227 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పుట్టపర్తి, ధర్మవం, తాడిపత్రి పట్టణాలు కూడా కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారాయి.
చిరువ్యాపారులు లాక్డౌన్తో ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతుండటంతో జిల్లా అంతటా సడలింపులు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ప్రజలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న కారణంగా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అనవసరంగా రోడ్లపైకి వచ్చే ప్రజల్లో మార్పురాని పరిస్థితి కనిపిస్తోంది.