అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి విజంభిస్తోంది. సెకండ్ వేవ్‌లో శుక్రవారం రికార్డు స్థాయిలో అత్యధికంగా 1,201 కేసులు నమోదయ్యాయి. మొత్తం 6,289 నమూనాలను పరీక్షించగా.. 1,201 మందిలో వైరస్ ఉన్నట్లు తేలింది. అంటే ప్రతి వందలో 19 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తుందో ఈ గణాంకాలే నిదర్శనం. కొత్త కేసులతో కలిపితే బాధితుల సంఖ్య 74,723కు చేరింది. ఇప్పటికే 69,792 మంది కోలుకున్నారు. 623 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 4,308 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం 333 మంది డిశ్ఛార్జి అయ్యారు.
అనంతలో 465..
కొత్త కేసుల్లో నగరంలోనే 465 మంది బాధితులు ఉన్నారు. ఆ తర్వాత హిందూపురం 168, గుంతకల్లు 100, ధర్మవరం 70, కదిరి, యాడికి 26 చొప్పున, ముదిగుబ్బ, ఉరవకొండ 22 ప్రకారం, పెనుకొండ 17, బత్తలపల్లి 16, తాడిపత్రి, గుడిబండ 15 చొప్పున, ఎన్‌పీకుంట, పెద్దవడుగూరు 12 ప్రకారం, రొద్దం 11 మంది, అగళి, కదిరి గ్రామీణం, పెద్దపప్పూరు, సోమందేపల్లిలో పది ప్రకారం, గార్లదిన్నె, లేపాక్షి, నల్లమాడ తొమ్మిది చొప్పున, గోరంట్ల, పుట్టపర్తి, రాప్తాడు, శింగనమలలో 8 చొప్పున.. ఇలా 58 పట్టణ, మండలాల్లో కేసులు నమోదయ్యాయి.
చికిత్స పొందుతూ మృతి
రొద్దం మండలానికి చెందిన 45 ఏళ్ల ఓ వ్యక్తి కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో సర్వజనాస్పత్రికి ప్రత్యేక వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస వదిలాడు.
ఆక్సిజన్ పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు
కొవిడ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు, సరఫరా తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సర్వజన ఆసుపత్రికి ఆర్‌ఎంవో విశ్వనాథయ్యతో పాటు ఆరుగురు సభ్యులను నియమించామన్నారు. హిందూపురం ఆసుపత్రికి ఆర్‌ఎంవో రుక్మిణమ్మతో పాటు నలుగురు, కదిరి ఏరియా ఆసుపత్రికి వైద్య పర్యవేక్షకుడు తిప్పేస్వామితో పాటు నలుగురు, గుంతకల్లు ఏరియా ఆసుపత్రికి వైద్య పర్యవేక్షకురాలు కమలమ్మతో పాటు ఐదుగురు, కిమ్స్ సవీరాకు పర్యవేక్షకుడు హమీబ్‌రాజతోపాటు నలుగురు, బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి డైరెక్టర్ ప్రవీణ్‌తోపాటు నలుగురు, గుర్తించిన ప్రైవేటు ఆసుపత్రులకు నోడల్ అధికారి, యాజమాన్యం ప్రతినిధులు సభ్యులుగా నియమించినట్లు కలెక్టర్ తెలియజేశారు.
సర్పంచులూ.. సహకరించండి..
కరోనా కట్టడికి గ్రామస్థాయిలో సర్పంచులు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఆయన సర్పంచులతో వీక్షణ సమావేశం నిర్వహించారు.
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయినా ఎవరూ భయపడాల్సిన పనిలేదు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని చిన్నసమావేశ మందిరంలో జేసీ నిశాంత్‌కుమార్‌తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 4308 యాక్టివ్ కేసులు ఉండగా.. 687 మంది ఆసుపత్రుల్లో ఉన్నారన్నారు. 67 మంది ఐసీయూలో, 403 మంది నాన్‌ఐసీయూలో ఉన్నట్లు వివరించారు. 316 మందికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పేరుతో అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో స్కానింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తే సహించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించబోమన్నారు.