ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2020, 11:14 PM IST

ETV Bharat / state

విజృంభిస్తున్న వైరస్.. జిల్లాలో ఒక్కరోజే 1016 కరోనా కేసులు

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు వైరస్ తీవ్రతతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఓవైపు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లతో పరీక్షల సంఖ్యను పెంచగా.. రోగుల సంఖ్య ఆ మేరకు నమోదవుతోంది. సంజీవని బస్సుల సంచార ప్రయోగశాలలతో పాటు, జిల్లా వ్యాప్తంగా 5 చోట్ల రోజూ.. దాదాపు 4వేల మందికి వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా విడదలైన నివేదికలో ఒక్కరోజే 1016 మందికి పాజిటివ్ వచ్చింది. వయసుతో నిమిత్తం లేకుండా.. ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యలతోనే ఆస్పత్రులకు వస్తున్నారు.

corona-cases-
corona-cases-

అనంతపురం జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు వైరస్ బాధితుల్లో 60ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాల వ్యాధులున్నవారికే వైరస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని భావించారు. అయితే తాజాగా వ్యాధి బారిన పడుతున్న యువతలో సైతం శ్వాసకోస సమస్యలు తలెత్తుతుండటం, సమయానికి ఆక్సిజన్ అందక మృతి చెందుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ వారంలో వైరస్ భారిన పడిన 35 ఏళ్ల లోపు యువతలో ఎక్కువ మంది శ్వాస తీసుకోలేని పరిస్థితిలో.. అత్యవసర ఆసుపత్రి వైద్యం అందించాల్సి వస్తోంది.

జిల్లాలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. నగరం నుంచే 500లకు పైగా కేసులు నమోదుకాగా.. ధర్మవరం, తాడిపత్రి తదితర పట్టణాల్లోనూ అత్యధిక మంది వైరస్ కు గురయ్యాయి. అనంతపురంలో వైరాలజీ ప్రయోగశాలతోపాటు, మరో 5 చోట్ల ట్రూనాట్ ల్యాబ్ లను ఏర్పాటు చేశారు. కొత్తగా మరో 4 ట్రూనాట్ యంత్రాలు జిల్లాకు వచ్చాయి. ప్రస్తుతం అన్ని ప్రయోగశాలలతో కలిపి రోజూ 4 వేల నమూనాలు పరీక్షిస్తున్నారు.

వీటితోపాటు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా 15 నిమిషాల్లోనే ఫలితాలు ఇస్తుండటంతో కొత్తగా బాధితుల సంఖ్య వెలుగు చూస్తోంది. ఆస్పత్రులకు వచ్చిన గర్భిణిలు, ఇతర జబ్బులతో వైద్యం కోసం వచ్చిన రోగులందరికీ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష నిర్వహించి.. కరోనా వైరస్ నెగిటివ్ వస్తేనే వైద్యం చేస్తున్నారు. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే రోగులను అనంతపురం, హిందూపురం, బత్తలపల్లి ఆసుపత్రులకు పంపుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 10 చోట్ల కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు 6 కేంద్రాలకు మాత్రమే రోగులను పంపుతున్నారు. వీటితో పాటు జిల్లాలో 16 కొవిడ్ ఆసుపత్రులను గుర్తించారు. వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ రోగులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిని పూర్తిస్థాయి కొవిడ్ ఆసుపత్రిగా మార్చిన అధికారులు.. గురువారం నుంచి వైరస్ బాధితులను చేర్చుకొని వైద్యం అందిస్తున్నారు. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తమకు అప్పగించాలని సత్యసాయి ట్రస్టును జిల్లా అధికారులు కోరారు. ఈ ఆసుపత్రిని కొవిడ్ వైద్యం కోసం వినియోగిస్తే.. అక్కడ కనీసం వెయ్యి పడకలు ఏర్పాటు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏరియా ఆసుపత్రులను 3 రోజుల క్రితమే కొవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చారు. కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం తదితర ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించాలని అధికారులు ప్రణాళిక చేశారు. కొవిడ్ కేర్ సెంటర్లలో సౌకర్యాలపై రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు కేంద్రాల్లో వైద్యం అందడంలేదని, కేవలం నర్సులు ఉదయం మాత్రలు ఇచ్చి వెళ్లిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి;రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆ మూడు జిల్లాల్లోనే అధికం

ABOUT THE AUTHOR

...view details