అనంతపురం జిల్లాలో ఒక్కరోజులో 311 మందికి వైరస్ నిర్ధరణ కావడం హడలెత్తిస్తోంది. కొత్త కేసుల్లో 161 మంది అనంతపురం పట్టణానికి చెందిన వారు ఉన్నారు. కొత్తగా ధర్మవరంలో 29, కదిరిలో 21, గుత్తిలో 11, హిందూపురంలో 9, సీకేపల్లి, గార్లదిన్నె మండలాల్లో 7 కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 3161 మందికి వైరస్ సోకగా.. 23 మంది ప్రాణాలొదిలారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 ప్రయోగశాలల్లో రోజూ రెండు వేల నమూనాలను పరీక్షిస్తున్నారు.
కంట్రోల్ రూమ్‌కు వందల ఫోన్లు
అధికారులు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా అనంతపురం జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. మార్చి 29న లేపాక్షి మండలంలో పదేళ్ల చిన్నారికి వైరస్ సోకిందని గుర్తించినది మొదలు రోజూ బాధితుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, వారి వ్యక్తిగత సిబ్బంది, వందల సంఖ్యలో పోలీసులు, పదిమంది వరకు మీడియా ప్రతినిధులు వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకిన వారు ఇంటివద్దనే ఉండి చికిత్స తీసుకుందామనుకున్నా... ఇరుగు, పొరుగువారితో సమస్యగా మారింది. వైరస్ సోకిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు రోజూ 100కు పైగా ఫోన్లు వస్తున్నాయి. వ్యాధి సోకిందనే బాధ కన్నా పక్క వారి వివక్షతోనే రోగులు ఎక్కువగా మనోవేదనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.