ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండ మదర్సా ఘటనపై ఈటీవీ భారత్​ కథనం.. స్పందించిన సీఎంవో - MEO

Uravakonda madrasa incident: మదర్సాలో విద్యార్థులను చితకబాదిన ఘటన ఈటీవీ భారత్​లో ప్రచురితమైంది. దీనిపై సీఎంవో అధికారులు స్పందించారు. జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించారు. అధికారుల అదేశాల మేరకు పోలీసులు ఉపాధ్యక్షుడిపై కేసు నమోదు చేశారు.

Uravakonda madrasa incident
ఉరవకొండ మదర్సా ఘటన

By

Published : Nov 1, 2022, 9:56 AM IST

Updated : Nov 1, 2022, 11:46 AM IST

Uravakonda madrasa incident: అనంతపురం జిల్లా ఉరవకొండ మదర్సాలో విద్యార్థులను ఉపాధ్యక్షుడు చితకబాదిన ఘటనపై 'ఈటీవీ భారత్​లో' ప్రచురితమైన కథనాలపై సీఎంవో అధికారులు స్పందించారు. బోధకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉరవకొండ పట్టణంలోని బళ్లారి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మదర్సాలో విద్యార్థులను చితకబాదిన బోధకుడు మహబూబ్ బాషాపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ హరినాథ్ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి మదర్సాలో 18 మంది విద్యార్థులను బోధకుడు చితకబాదిన వైనంపై సోమవారం ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు జిల్లా ఉన్నతాధికారులతో ఆరా తీశారు. వారి ఆదేశాల మేరకు ఉరవకొండ ఎంఈవో ఈశ్వరప్ప అక్కడ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. బోధకుడిని కేసు నుంచి రక్షించడానికి కొందరు వ్యక్తులు ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ వద్ద ప్రయత్నాలు సాగించటం గమనార్హం రాష్ట్రస్థాయి అధికారుల తక్షణ స్పందనతో స్థానిక అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కొట్టింది వాస్తవమే:బోధకుడు మహబూబ్ బాషా విద్యార్థులను కొట్టిన విషయం తమ విచారణలో వాస్తవమేనని తేలిందని మైనార్టీ జిల్లా సంక్షేమాధికారి మహమ్మద్ రఫి పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆయనమైనార్టీ జిల్లా సంక్షేమాధికారి వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనపై విద్యార్థులను విచారించడంతో పాటు వారికి తగిలిన దెబ్బలను పరిశీలించినట్లు చెప్పారు. మదర్సా 2003 నుంచి కమిటీ ఆధ్వర్యంలో నడుస్తోందన్నారు. ప్రస్తుతం అక్కడ 18 మంది విద్యార్థులు ఉండగా వారిలో నలుగురి వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాల్సి ఉందన్నారు. పాఠ్యాంశాలపై దృష్టి పెట్టకపోవడంతో బెత్తంతో కొట్టినట్లు బోధకుడు రాతపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు వివరించారు.

ఇది జరిగింది:ఉరవకొండ శివారులోని కేకే పెట్రోల్ బంక్​ ఎదురుగా ఉన్న మదర్సాలో చదువుతున్న విద్యార్థులను (ముస్లిం పిల్లలు) అక్కడ ఉర్దూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు (హాజరత్) మహబూబ్ బాషా విచక్షణారహితంగా కొట్టడంతో వారికి వాతలు పడ్డాయి. వీపు, మొహం, తొడలపై ఇలా ఎక్కడ పడితే అక్కడ కర్రలతో, ప్లాస్టిక్ పైపులతో బాధడంతో చిన్నారుల శరీరం మొత్తం బొబ్బలు వచ్చాయి. మరికొందరికి రక్తస్రానమైంది. నొప్పిని భరించలేని ఆ చిన్నారులు అర్ధరాత్రి సమయంలో అంతా కలిసి మదర్సా ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులో పనిచేసే యువకులకు ఈ విషయాన్ని చెప్పగా వారు ఉరవకొండ ఎస్సై వెంకటస్వామికి సమాచారం ఇచ్చారు.

ఎస్సై సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లగా విద్యార్థుల ఒంటిపై వాతలు, వారు పడుతున్న బాధను చూసి చలించిపోయారు. జరిగిన విషయం మొత్తం ఎస్సైకి విద్యార్థులు చెప్పారు. తమకు అన్నం సరిగా పెట్టడం లేదని, వండిన అన్నం ఇంటికి తీసుకెళ్తున్నాడని, తమకు ఎవరైనా దాతలు ఇచ్చిన డబ్బులు, తమ దగ్గర ఉన్న డబ్బులు కూడా హాజరత్ తీసుకెళ్తున్నాడని ఆ విద్యార్థులు తెలిపారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా లేకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ దాదాపు 24మంది విద్యార్థులు ఉండగా ప్రతిఒక్కరు ఆ ఉపాధ్యాయుడి వల్ల ఇబ్బంది పడుతున్నట్లు వారు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 1, 2022, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details