CM YS Jagan Releases YSR Free Crop Insurance Funds అనంతపురం జిల్లా కల్యాణదుర్గం రైతు దినోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. కష్టకాలంలోనూ అన్నదాతలకు అండగా ఉండేందుకు... అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రైతులు కష్టంలో ఉన్నపుడు అండగా నిలబడి పరిహారం అందించామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉండేదని, ఏటా కరవు మండలాలు ప్రకటించే వారన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పంట నష్టపోయిన రైతులకు అరకొరగా పరిహారం ఇచ్చారని, తమ నాలుగేళ్ల పాలనలో ఏటా వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని కరవు అనే మాటే లేదన్నారు. అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం ఇస్తున్నామని జగన్ చెప్పారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కరవుతో పంట నష్టపోయిన 30.25 లక్షల మంది రైతులకు చెల్లించిన పరిహారం 3 వేల 411 కోట్లు మాత్రమేనని జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లలో పంటలు నష్టపోయిన 54 లక్షల 48వేల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల పరిహారం చెల్లించినట్లు చెప్పారు.
CM YS Jagan టీడీపీ హయాంలో రైతులకు సాయం లేదు.. మేం పంట నష్టపోయిన రైతులకు బీమా అందిస్తున్నాం: సీఎం - ఏపీ సీఎం వార్తలు
YSR Free Crop Insurance Funds: దేశంలో ఎక్కడా లేని విధంగా పంట నష్టపోయిన రైతులకు బీమా ఇస్తున్నామని.. సీఎం జగన్ తెలిపారు. అనంతపురంలో రైతు దినోత్సవ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, తెలుగుదేశం హయాంలో... అన్నదాతలకు ఎలాంటి సాయం అందలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే విపక్షాలు ఏకమై వస్తున్నారంటూ మండిపడ్డారు.

బైరవానితిప్ప జలాశయానికి నీరు తరలించే కాలువ తవ్వడానికి భూ సేకరణకు 208 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. గతంలో భూ సేకరణ నిలిచిపోయిందని, తాము 1408 ఎకరాల భూమి సేకరించి ప్రాజక్టుకు నీరుతెచ్చే పనులు ప్రారంభిస్తామన్నారు. గత ఏడాది ఖరీఫ్ లో పంట నష్టపోయిన 10.20 లక్షల మంది రైతులకు 1117.21 కోట్ల రూపాయలు బీమా పరిహారం బటన్ నొక్క నేరుగా రైతుల ఖాతాలకు జమచేస్తున్నామన్నారు. రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే, అవినీతి లేకుండా బీమా పరిహారం ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలతో ప్రయోజనం చేస్తుంటే సుప్రీం కోర్టువరకు వెళ్లి నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విమర్శలు చేశారు.
సభకు వచ్చిన జనం, బందోబస్తు పోలీసుల అగచాట్లు.. సీఎం జగన్ సభకు కళ్యాణదుర్గం, రాప్తాడు, ఉరవకొండ, మడకశిర నియోజకవర్గాల నుంచి బస్సులు ఏర్పాటు చేసి జనాన్ని తీసుకొచ్చారు. మద్యం సేవించే వారికి కర్ణాటక మద్యం 90 మిల్లీ లీటర్ల టెట్రాప్యాక్ ను చేతిలో పెట్టి పంపించారు. దీంతో చాలా మంది సభావేదిక సమీపంలో కర్ణాటక మద్యం పూటుగా తాగి నడిచి సభలోకి వెళ్లలేక మైదానంలో అట్టే పడిపోయారు. ముఖ్యంగా సీఎం జగన్ మాట్లాడుతుండగానే సభకు తీసుకొచ్చిన జనం వెళ్లిపోవటంతో సగానికి పైగా సభ ఖాలీ అయింది. ఐదెంచల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు సభ మధ్యలో వెళ్లకుండా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా... గొడవ పెట్టుకొని వందలాది మంది వెలుపలికి వెళ్లారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచి సభ నిర్వహణకు భద్రత ఏర్పాట్లు విధుల్లో ఉన్న పోలీసులకు ఉదయం 9.35 గంటల వరకు అల్పాహారం ఇవ్వలేకపోయారు. సమీపంలో హోటళ్లు, దుకాణాలు భద్రతలో భాగంగా మూసివేయటంతో కొనుక్కొని తినటానికి కూడా అవకాశం లేక బందోబస్తులోని పోలీసులు ఆకలితో అల్లాడిపోయారు.