అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ పరిశ్రమలో నేటి నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలైంది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహాయ సహకారాలతో వేగవంతంగా మౌలిక సదుపాయాలు అందిపుచ్చుకున్న కియా మోటార్స్... అనుకున్న సమయానికన్నా 6 నెలలు ముందుగానే ఉత్పత్తి ప్రారంభించింది. కియా కార్లు మార్కెట్లోకి విడుదల చేయటానికి ముందే... అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించింది.
ఆ సంస్థ ఊహించని రీతిలో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన రోజునే... 6 వేలకు పైగా కార్లు బుకింగ్ చేసుకున్నారు. ఇప్పటికే కార్ల ఉత్పత్తిని ప్రారంభించిన కియా పరిశ్రమ... నేటి నుంచి పూర్తిస్థాయి సామర్థ్యం మేర కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ గ్రాండ్ ప్రొడక్షన్ సెర్మనీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు.
అన్ని విధాల సహకరిస్తాం...
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. కియా పరిశ్రమ మరింత విస్తరించి, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని హామీఇచ్చారు. అంతర్జాతీయస్థాయి ప్రాజెక్టును విజయవంతంగా నెలకొల్పిన కియా బృందానికి అభినందనలు చెప్పిన సీఎం... మరెన్నో కంపెనీలు దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో తమ ప్లాంట్లను నెలకొల్పుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కియా త్వరలో మరిన్ని బ్రాండ్లను తీసుకొస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 లక్షలకు పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.
కార్యక్రమం సాగిందిలా..!
సీఎం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్లో కియా మోటార్స్ వద్దకు వెళ్లారు. కియా మోటార్స్ సీఈవో హున్ హుపార్క్, భారత-దక్షిణ కొరియా రాయభారి షిమ్ బొంగ్ కిల్లు హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి జగన్కు స్వాగతం పలికారు. అనంతరం సీఎం, మంత్రులు గౌతంరెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, జయరాంలతో కలిసి కార్ల తయారీ ప్లాంట్ను పరిశీలించారు.