ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని.. సీజేఐ జస్టిస్ ఎన్.వీ రమణ అన్నారు. పాలకులు వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. పెద్దలను గౌరవిస్తున్నారా.. లేదా అనేది పాలకులు గుర్తుంచుకోవాలన్న సీజేఐ.. బలహీనుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారా ? అనేది కూడా ఆలోచించాలన్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే పాలకులకి 14 అవ లక్షణాలు వస్తాయన్న జస్టిస్ ఎన్.వీ రమణ.. అవలక్షణాలను సరిచేసుకుని మంచి పాలన అందించాలన్నారు.
పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీజేఐ జస్టిస్ ఎన్.వీ రమణ..విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు. నేర్చుకున్న విద్యా విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న సీజేఐ..ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సత్యసాయి మాతృ ప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారన్న ఆయన.. ఎక్కడికెళ్లినా మాతృభాషకు ప్రాధాన్యమిచ్చేవారని గుర్తు చేశారు. సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనాటి తన పదవులు, గౌరవానికి సత్యసాయి ఆశీస్సులే కారణమన్నారు.