ఐరన్ పరిశ్రమలో పని చేస్తున్న ఓ బాల కార్మికుడు తీవ్రంగా గాయాలు పాలైన సంఘటన అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామ సమీపంలోని రామాంజనేయ స్పాంజ్ పరిశ్రమలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 13 ఏళ్ల బాల కార్మికుడికి చేయి విరిగిపోయింది. కర్మాగారంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో చేయి ఇరుక్కొని నుజ్జునుజ్జయింది.
తీవ్ర గాయాలపాలైన బాలుడిని కర్ణాటకలోని బళ్ళారిలో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు బాలుడు చెయ్యి పూర్తిగా తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం బాల కార్మికుడిని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బొమ్మనహల్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.