వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు యథేచ్ఛగా కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినా... రాష్ట్రంలో ఎక్కడా ఒక్క కేసు నమోదు చేయలేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వందలాది మందితో బహిరంగ సమావేశాలు పెట్టిన విజయసాయిరెడ్డి లాంటి వారిని వదిలేసి, జేసీ కుటుంబసభ్యులపై మాత్రం తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వంతో ప్రజాభిమానం ఉన్న నాయకులను అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
'నియంతలు పాలకులైతే పరిపాలన ఇలాగే ఉంటుంది'
అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి కుట్ర రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలే అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల అక్రమ అరెస్టును ఆయన ఖండించారు. విడుదలైన 24 గంటలలోపే మరలా అరెస్ట్ చేయడం వైకాపా కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని తేల్చిచెప్పారు.
జగన్ కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరుతున్నాయని, విధ్వంసం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజాక్షేమం కోసం వినియోగించకుండా ప్రతిపక్ష నేతలను అణచివేయడానికి ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు. నియంతలు పాలకులైతే పరిపాలన ఇలాగే ఉంటుందని... ఇకనైనా కక్ష సాధింపు చర్యలు వీడి అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'