రాష్ట్రంలో ఇప్పటివరకు 280 దాడులు జరిగాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనేకచోట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్న చంద్రబాబు... 7 హత్యలు జరిగాయని వివరించారు. బెందాళం అశోక్, ఆయన అనుచరులపైనా దౌర్జన్యం చేశారని తెలిపారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడాలన్న చంద్రబాబు... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టం ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.
పోరాడలేకనే..
ప్రకాశం జిల్లాలో మహిళను దారుణంగా అవమానించి... కాళ్లతో తన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళపై ఈ స్థాయిలో దాడి జరిగితే సీఎం, హోంమంత్రికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. తెదేపా సభ్యులతో పోరాడలేక మైకులు కంట్రోల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్మవరంలో చేనేత కార్మికుడిని దారుణంగా చంపేశారన్న చంద్రబాబు... వైకాపా నేతలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిస్సహాయ స్థితిలో పోలీసులు
తాడిపత్రిలో వ్యక్తిని చంపి తిరిగి అతడి కుటుంబసభ్యులపైనే కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారన్న చంద్రబాబు... పల్నాడులో 10 గ్రామాల ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊళ్లకు రావొద్దని బెదిరిస్తూ... కేసులు పెడుతున్నారని చెప్పారు. పోలీసులే నిస్సహాయ స్థితిలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.