ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chandrababu Comments on CM Jagan: బడ్జెట్‌లో కేవలం 2.35 శాతం ఖర్చు చేస్తే.. ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమా?: చంద్రబాబు - సీఎం జగన్​పై చంద్రబాబు ఫైర్

Chandrababu Anantapur Tour : సాగునీటి రంగానికి చేసిన మోసంతో.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామిక అభివృద్ధితో దక్షిణ కొరియాలా మారుతున్న ఆంధ్రప్రదేశ్​ని.. నేడు తన నియంతృత్వ నిర్ణయాలతో ఉత్తర కొరియాగా సీఎం మార్చాడంటూ మండిపడ్డారు. పులివెందులకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా అని సవాల్ చేశారు. రాజధానికి భూ త్యాగం చేసిన రైతుల భూమి వేరొకరికి ఇవ్వటానికి ఈ ముఖ్యమంత్రి ఎవరని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Chandrababu Comments on CM Jagan
Chandrababu Comments on CM Jagan

By

Published : Aug 3, 2023, 3:03 PM IST

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట పర్యటన

Chandrababu Anantapur Tour : పులివెందులకు నీరు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పలేని వాడు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు మూడో రోజు పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆ ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

రాష్ట్రానికి ఓ వ్యక్తి ఎంత విధ్వంసం, అన్యాయం చేయగలుగుతాడో చెప్పేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తి రాష్ట్రానికి ఎంత చేటు చేస్తాడో ప్రతీ ఒక్కరూ గ్రహించాలని కోరారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తన పేరు చెప్పుకున్నట్లుగా.. టీడీపీ చేసిన అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి తన పేరు వేసుకుంటున్నాడని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న రీతిలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దోపిడీకి అంతమే లేదన్నట్లుగా మంత్రి పెద్దిరెడ్డి ప్రాజెక్టులు, గనులు దోచుకుంటున్నారని ఆరోపించారు. పులివెందుల చక్రాయపేట నుంచి తంబలపల్లికి నీటి తరలింపు పేరుతో పెద్దిరెడ్డికి 5వేల 36కోట్ల రూపాయల లబ్ధితో అనుమతులు మంజూరు చేశారని ధ్వజమెత్తారు. ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవరికి పేరు వస్తుందోననే ప్రాజెక్టులు అటకెక్కించారని మండిపడ్డారు.

కియా అనుబంధ ఆక్సిలరీ యూనిట్స్​ని రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి తరిమేశాడని చంద్రబాబు ఆరోపించారు. కియా మోటార్స్.. రాయలసీమ దశ, అనంతపురం దిశ మార్చేసిందని అన్నారు. భారతదేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి కియా మోటర్స్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో 28 వేల కోట్ల రూపాయల్ని అనంతపురంలో పెట్టుబడిగా పెడితే రాజశేఖర్ రెడ్డికి కల వచ్చిందంటూ మంత్రి చవకబారుగా మాట్లాడారని చంద్రబాబు దుయ్యబట్టారు. కియా ద్వారా ప్రత్యక్షంగా 12వేల 800 మందికి, పరోక్షంగా 50వేల మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు.

హంగేరియన్ యూనివర్సిటీ అఫ్ అగ్రికల్చర్ అండ్ సోషల్ స్టడీస్ వారి రీసెర్చ్ పేపర్ ప్రకారం.. ఉపాధి, విద్య, కొత్త వ్యాపారాలు, వాణిజ్య సముదాయాలను కూడా ఈ ప్రాజెక్ట్ ప్రభావితం చేసిందని అన్నారు. అతి తక్కువ కాలంలోనే దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్స్​లో ఒకటిగా తయారై 10 లక్షలకు పైగా కార్లను ఉత్పత్తి చేసిందన్నారు. కియా కంపెనీ.. ప్రభుత్వంతో కలిసి స్కిల్ డెవలప్​మెంట్​ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ రాష్ట్రంలో యువతకు ఉపాధికి డోకా లేకుండా చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా కియా పరిశ్రమను సందర్శించిన చంద్రబాబు అక్కడ సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు.

అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు చెరువుల్ని కూడా కబ్జా చేసి వాటిని పూడ్చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రాజెక్టులకు పూర్వ వైభవం తీసుకొచ్చే ముందుచూపు తనకుందన్న ఆయన.. జగన్మోహన్ రెడ్డివి అడ్డచూపులు, వంకర చూపులేనంటూ దుయ్యబట్టారు. హంద్రీనీవా, సుజల స్రవంతి ఫేస్ 2లో భాగమైన మారాల రిజర్వాయర్​ను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తే, వైసీపీ కాలువలు పూర్తి చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.

చెరోపలి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వ నిర్వహణ శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మడకశిర బ్రాంచి కాలువ ప్రాజెక్టును 805 కోట్ల వ్యయంతో దాదాపు పూర్తి చేస్తే, గత 4 సంవత్సరాలుగా కాలువ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ధ్వజమెత్తారు. గొల్లపల్లి రిజర్వాయర్ ఆయకట్టు యుద్ధ ప్రతిపాదికన నిర్మించటం వల్లే కియా పరిశ్రమ వచ్చిందని గుర్తు చేశారు. గుంతకల్లు బ్రాంచి కెనాల్లో శిథిలావస్థలో ఉన్న అండర్ టన్నెల్స్ మరమ్మతులు చేపట్టని కారణంగా లీకేజీలతో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హంద్రీనీవా - సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 4వేల 182 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ 4ఏళ్లలో చేసిన ఖర్చు కేవలం 515 కోట్లు మాత్రమే అని ఆక్షేపించారు. టీడీపీ హయంలో ప్రధాన కాల్వ విస్తరణకు 1030 కోట్లు మంజూరు చెేసి, 50 శాతం పైగా పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. ప్రధాన కాలువ సామర్థ్యం రెండు దశలలో 10 వేల క్యూసెక్కులకు పెంచుతామని వైసీపీ ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. 6వేల 182 కోట్లకు GO విడుదల చేయడం కానీ, టెండర్లు పిలవడం కానీ చేయలేదని మండిపడ్డారు.

జీడిపల్లి - భైరవానితిప్ప లిఫ్ట్​కు 4 సంవత్సరాలలో అంగుళం పని కూడా సాగలేదని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పూర్తి చేస్తామన్న జగన్ హామీ ఏమైందని నిలదీశారు. రాయదుర్గం రైతు దినోత్సంలో 60 రోజులలో భూసేకరణ పూర్తీ చేస్తానన్న హామీతో పాటు కళ్యాణదుర్గం రైతు దినోత్సవంలో 208 కోట్లు తక్షణం విడుదల చేస్తానని సీఎం ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని దుయ్యబట్టారు.

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ అనంతరం జీడిపల్లి టు అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించారు. అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని 890.60 కోట్లతో సహకార సూక్ష్మ సేద్య పథకాన్ని టీడీపీ హయాంలో ప్రారంభించామని చంద్రబాబు గుర్తు చేశారు. 90 శాతం సబ్సిడీ, నరేగా నిధులతో ఫార్మ్ పాండ్స్ ద్వారా బిందు సేద్యం సాయంతో తక్కువ నీటితోనే రెట్టింపైన వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించామని వివరించారు.

వైసీపీ అధికారంలోకి రాగానే సబ్సిడీ ఎత్తివేతతో సాగు విస్తీర్ణం తగ్గిందని ధ్వజమెత్తారు. ఉరవకొండ బిందు సేద్యానికి 100కోట్ల రూపాయల ఖర్చుతో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా ప్రణాళికలు రచిస్తే, వైసీపీ ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా మూలన పడేసిందని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో సమకూర్చిన డ్రిప్ పరికరాలు గుట్టలు గుట్టులగా వృథాగా పడి ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ నిర్ణయాలతో జీవో నెం 365 ద్వారా రాష్ట్రంలో 198 సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రీ క్లోజ్ చేశాడని చంద్రబాబు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details