అనంతపురం జిల్లాలోని ప్రఖ్యాత లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం, ఏకశిలా రాతి నంది విగ్రహాలను యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభకు వివరించారు. భాజపా సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వారసత్వ కేంద్రాలకు విశ్వవ్యాప్తంగా ఉన్న విలువను దృష్టిలో ఉంచుకుని యునెస్కో నిర్వహణ మార్గదర్శకాలను అనుసరించి వాటిని యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేయనున్నట్లు మంత్రి తన సమాధానంలో వివరించారు.
కేంద్ర ప్రభుత్వానికి అందిన అన్ని ప్రతిపాదనలను..ఆయా ప్రదేశాలకు ఉన్న ప్రపంచ వ్యాప్త విలువ, కొలమానం, సమగ్రత, ఇతర స్థలాలతో పోల్చితే వాటికి ఉన్న ప్రాధాన్యం ఆధారంగా మదింపు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటివరకు భారత్ నుంచి 46 ప్రతిపాదనలను ఈ తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు తెలిపారు. వీటిలో.. తెలంగాణ నుంచి గోల్కొండ కోట, చార్మినార్‌లను ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ చీర నేత క్లష్టర్లను చేర్చినట్లు మంత్రి సమాధానమిచ్చారు.