ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీ ఓట్ల తొలగింపుపై ఈసీ ఆగ్రహం.. అనంతపురం జిల్లాకు దిల్లీ అధికారి రాక

CEC Enquiry on Bogus Voters Updates: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపును భారత ఎన్నికల సంఘం (ఈసీ) సీరియస్‌గా తీసుకుంది. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని నిగ్గు తేల్చటానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారి స్వయంగా నేడు విచారణకు విచ్చేస్తున్నారు. సీఈసీ ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హడావిడిగా ఇద్దరు బీఎల్వోలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

CEC Enquiry
టీడీపీ ఓట్ల తొలగింపుపై ఈసీ ఆగ్రహం

By

Published : Jan 4, 2023, 7:18 AM IST

CEC Enquiry on Bogus Voters Updates: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఇచ్చిన ఫిర్యాదును భారత ఎన్నికల సంఘం (ఈసీ) సీరియస్‌గా తీసుకుంది. క్షేత్రస్థాయి విచారణకు ఈసీ ప్రధాన కార్యదర్శి నేడు ఉరవకొండ వస్తున్నట్లు సమాచారం. అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టరు నాగలక్ష్మికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ఓట్ల తొలగింపుపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న జిల్లా ఉన్నతాధికారులు.. ఈసీ ప్రధాన కార్యదర్శి విచారణ రానుండడంతో అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ఇద్దరు బీఎల్వోలను సస్పెండు చేస్తూ కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల అక్రమ తొలగింపుపై పలుమార్లు ఫిర్యాదు చేసినా జిల్లా అధికారులు పట్టించుకోలేదని.. విచారణ పేరుతో జాప్యం చేస్తూ వచ్చారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇదీ జరిగింది: ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని విడపనకల్లు మండలం చీకలగురికిలో 13 మంది టీడీపీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగించారని, విచారణ జరపాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ గతేడాది అక్టోబరులో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నవంబరు 3న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశాలిచ్చింది. అదే నెల 12వ తేదీన విడపనకల్లు తహసీల్దారు విచారణ జరిపి, ఆ నివేదికను కలెక్టరుకు పంపించారు. నవంబరు 21న తహసీల్దారు ఇచ్చిన నివేదికను కలెక్టరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. తహసీల్దారు నివేదికలో తప్పులున్నాయని ఎమ్మెల్యే కేశవ్‌ మళ్లీ ఈసీకి లేఖ రాశారు. దీంతో గుంతకల్లు ఆర్డీవోతో డిసెంబరు 29న విచారణ చేపట్టి నివేదిక రూపొందించారు.

సంతకాల ఫోర్జరీ: చీకలగురికి గ్రామంలో ఓట్ల తొలగింపులో జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అక్టోబరులోనే కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తూతూమంత్రంగా విచారణ జరిపి బాధ్యుల్ని వదిలేశారు. క్షేత్రస్థాయిలో ఓట్లను తొలగించేటప్పుడు సదరు వ్యక్తులకు కచ్చితంగా నోటీసులు ఇవ్వాలనేది నిబంధన. బీఎల్వోలు దీన్ని పాటించకుండానే టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. పయ్యావుల కేశవ్‌ ఈసీకి ఫిర్యాదు చేయడంతో నకిలీ నోటీసులు సృష్టించారు. ఓటర్ల సంతకాలు ఫోర్జరీ చేసి ముందుగానే నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు రూపొందించారు. ఆర్డీవో విచారణలో ఆ సంతకాలు తమవి కాదని బాధితులు వాపోయారు. క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు చెప్పిన వారి ఓట్లను అప్పటి తహసీల్దారు తొలగించినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈసీ నుంచి ఉన్నతాధికారులు నేరుగా విచారణకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరు హడావుడిగా బీఎల్వోలు మధు, గోపిలను సస్పెండు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరోపక్క దిల్లీ నుంచి వస్తున్న సీఈసీ ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌ను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కలుస్తున్నట్లు సమాచారం. పోర్జరీ సంతకాలతో ఓటర్లను జాబితా నుంచి తొలగించిన తీరును ఆయనకు వివరించనున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details