అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అక్రమ కర్ణాటక మద్యం, గుట్కా, జూదం ఆడే కేంద్రాలపై దాడులు జరిపి కట్టడి చేస్తున్నారు. నియోజకవర్గంలోని రొళ్ల మండలం జీ.ఏన్. పాలెం గ్రామంలో.. గంజాయి సాగు ప్రదేశాలపై సీఐ శ్రీరామ్, ఎస్ఐ మహబూబ్ పాషా సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
రొళ్ల మండలం జీ.ఏన్.పాలెం గ్రామానికి చెందిన శివన్న, అతని కుమారుడు పవన్.. వారి పొలంలోని వేరుశనగ చెట్ల మధ్యలో గంజాయి మొక్కల సాగును గుర్తించారు. అదే గ్రామంలో హనుమంతరాయ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో సాగు చేసిన గంజాయి మొక్కలను తొలగించి.. మొత్తం 28 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు.. నిందితులను రిమాండ్కు తరలించామని సీఐ శ్రీరామ్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తుల వివరాలు పోలీసులకు అందించి.. సమాజ శ్రేయస్సుకు సహకరించాలని సీఐ ప్రజలను కోరారు.