CAR ACCIDENT: అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బళ్లారి వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వంకలోకి దూసుకెళ్లింది. దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతులో పడిపోయింది. ఇదీ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి డీఎస్పీ నర్సింగప్ప, విడపనకల్లు ఎస్సై గోపాలుడు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి నుంచి క్రేన్ల ద్వారా కారును బయటకు తీసేందుకు ప్రయత్నించగా చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఈరోజు ఉదయం కారు బయటకు తీయగా ఓ మృతదేహం లభ్యమైంది.
మృతుడు కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన అశ్వత్ నారాయణగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో ఉన్న తన కుటుంబ సభ్యులను కలిసి తిరిగి బళ్ళారికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అతని స్నేహితులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని వారు వెళ్లి పరిశీలించగా అక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడంతోనే ఈ ప్రమదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చురుకుగా ఉండే మంచి మిత్రుడిని కోల్పోయామని స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.