ఈనెల 10న జరిగిన పురపాలక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విజయం ఎవరిని వరిస్తుందో అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి. అన్ని పార్టీల ముఖ్యనేతలు ఎన్నికల సరళి, ఫలితాలపై విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే క్రమంలో నగరపాలక మేయర్, అన్ని మున్సిపాలిటీల ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికపైనా సమాలోచనలు చేస్తున్నారు. ఫలితాల అనంతరమే పేర్లను ఖరారు చేయనున్నారు. ఈక్రమంలో ఛైర్మన్ పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు ముఖ్యనేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఈసారి తమకే అవకాశం ఇవ్వాలని విన్నవించుకుంటున్నారు. అయితే ఫలితాల తర్వాత అన్ని అంశాలను పరిగణనలోకి పేర్లను ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రాయదుర్గం..
ఇక్కడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించారు. చేనేత సంఘానికి సంబంధించిన వారికే ప్రతిసారి ఛైర్మన్ పదవి ఇస్తూ వచ్చారు. తెదేపా నుంచి 7వ వార్డు బరిలో నిలిచిన దబ్బడి శివన్న పేరును ఇప్పటికే ప్రకటించారు. వైకాపా నుంచి 32వ వార్డు బరిలో నిలిచిన గార్మెంట్ పరిశ్రమ యజమాని కొంతం దేవరాజు, 28వ వార్డు బరిలో నిలిచిన మాజీ కౌన్సిలర్ గోవిందరాజులు, 29వ వార్డు నుంచి పోటీ చేసిన రిబ్బక ఛైర్మన్ పదవి ఆశిస్తున్నారు. 7వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసిన శివకుమార్(దేవపుత్ర) కూడా రేస్‌లో ఉన్నారు.
కళ్యాణదుర్గం గ్రామీణం..
ఇక్కడ ఛైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. ఆర్టీసీ కండక్టరు ఉద్యోగానికి రాజీనామా చేసి తెదేపాలో చేరిన సత్యప్పను ఛైర్మన్ అభ్యర్థిగా ఉమామహేశ్వరనాయుడు ప్రకటించారు. వైకాపా నుంచి 17వ వార్డు బరిలో నిలిచిన బాలరాజేశ్వరి, 6వ వార్డు నుంచి పోటీలో ఉన్న సురేష్ ఛైర్మన్ రేసులో ఉన్నారు.
తాడిపత్రి(యాడికి)..
తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్ అభ్యర్థిగా వైకాపా తరపున కేతిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డిని ఇప్పటికే ప్రకటించారు. తెదేపా తరపున ఏడాదికొకరు చొప్పున అయిదుగురికి అవకాశం ఇస్తామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
ధర్మవరం పట్టణం..
ఇక్కడ ఛైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. వైకాపా నుంచి మాజీ కౌన్సిలర్ ఉడుముల రాము భార్య నిర్మలమ్మ, కాచర్ల లక్ష్మి పదవి ఆశిస్తున్నారు. తెదేపా ఛైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదు.
మడకశిర..
నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. మొత్తం 20 వార్డులకుగాను 4 వార్డులు మాత్రమే ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. ఆ వార్డుల నుంచి ఇరు పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులే కీలకంగా మారారు. తెదేపా తరపున 15వ వార్డు బరిలో నిలిచిన నరసింహరాజాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వైకాపా నుంచి 5వ వార్డుకు చెందిన ప్రియాంక, 7వ వార్డు నుంచి లక్ష్మీనరసమ్మ, 17వ వార్డు నుంచి సుభద్ర ఆశిస్తున్నారు.
హిందూపురం పట్టణం..
హిందూపురంలో వైకాపా తరపున 21వ వార్డు నుంచి పోటీ చేసిన మారుతిరెడ్డి పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించలేదు. అలాగే 14వ వార్డు బరిలో నిలిచిన బలరామిరెడ్డి కూడా ఛైర్మన్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. తెదేపా తరపున 21వ వార్డు అభ్యర్థి చంద్రమోహన్ పేరు వినిపిస్తోంది.
కదిరి..
ఇక్కడ ముస్లిం మహిళకు ఛైర్మన్ పదవి ఇస్తామని వైకాపా, తెదేపా ప్రకటించాయి. వైకాపా తరపున 10వ వార్డు బరిలో నిలిచిన బిల్సా దున్నిసా, 15వ వార్డు నుంచి సల్మా, 30వ వార్డు నుంచి గులాబ్‌జాన్ పదవిని ఆశిస్తున్నారు.
గుత్తి..
ఇక్కడ ఛైర్మన్ స్థానాన్ని ఓసీ జనరల్‌కు కేటాయించారు. వైకాపా నుంచి మాజీ సర్పంచి హుసేన్‌పీరా సతీమణి వన్నూర్‌బీ (23వ వార్డు), 19వ వార్డు నుంచి బరిలో నిలిచిన సుచరిత, 10వ వార్డుకు చెందిన రూపవతి, 8వ వార్డు బరిలో నిలిచిన పద్మలత పదవి ఆశిస్తున్నారు. తెదేపా నుంచి ప్రవీణ చౌదరి, రాణి పేర్లు వినిపిస్తున్నాయి.
అనంతపై అందరి చూపు
అనంత నగరపాలక మేయర్ అభ్యర్థులను ఇరుపార్టీలు ప్రకటించలేదు. వైకాపా తరఫున పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మహాలక్ష్మి శ్రీనివాస్ రెండుసార్లు తెదేపా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైకాపాలో చేరారు. చవ్వా రాజశేఖర్‌రెడ్డి గతంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. వీరిద్దరితోపాటు మైనార్టీ నాయకుడు మహమ్మద్ వసీం మేయర్ రేస్‌లో ఉన్నారు. తెదేపా తరపున 37వ డివిజన్ నుంచి బరిలో నిలిచిన మాజీ కార్పొరేటర్ నటేష్ చౌదరి, 31వ డివిజన్ నుంచి పోటీలో ఉన్న లింగారెడ్డి, 48వ వార్డు బరిలో ఉన్న స్వప్ప పేర్లు వినిపిస్తున్నాయి.
గుంతకల్లు ఎవరిదో..
ఇక్కడ మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం తెదేపా నుంచి 13వ వార్డు కౌన్సిలర్‌గా పోటీచేసిన కె.సి.అనురాధ పేరును ప్రకటించారు. ఈమె జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు కె.సి.నారాయణ కోడలు. వైకాపా ఇంకా మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే మున్సిపల్ మాజీ అధ్యక్షుడు రామలింగప్ప సతీమణి, మాజీ కౌన్సిలర్ భవానీ పదవిని కోరుకుంటున్నారు. ఈమె ప్రస్తుతం 28వ వార్డు నుంచి పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత ఎన్.గాదిలింగప్ప సతీమణి వెంకటలక్ష్మి 22 వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమె కూడా ఛైర్‌పర్సన్ రేసులో ఉన్నారు. 24వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కుమార్తె నైరుతమ్మ కూడా పదవిని ఆశిస్తున్నారు.
పుట్టపర్తిలో ఎవరు?
నగర పంచాయతీ ఛైర్మన్ పీఠం జనరల్‌కు కేటాయించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. మొత్తం 20 వార్డులు ఉన్నాయి. వైకాపా తరపున 19వ వార్డు అభ్యర్థిని లక్ష్మీదేవి మాధవరెడ్డి, 8వ వార్డు అభ్యర్థిని సాయిగీతా, 6వ వార్డు అభ్యర్థిని శ్రీలక్ష్మి నారాయణరెడ్డి పోటీ పడుతున్నారు. ఫలితాల తర్వాతే ఛైర్మన్‌ను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్ష తెదేపా నుంచి 20వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రత్నప్పచౌదరి పేరును మాజీ మంత్రి పల్లె ఇప్పటికే ప్రకటించారు.
ఇదీ చూడండి:
కడప ఉక్కుకు చిక్కులు?