దశాబ్దానికి పైగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య నలుగుతున్న సరిహద్దు వివాదం మరో రెండు నెలల్లో సమసిపోనుంది. మైనింగ్ కంపెనీలు అక్రమంగా చొరబడి చెరిపేసిన అంతర్రాష్ట్ర సరిహద్దుల పునరుద్ధరణలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. భూభాగం తమదంటే.. తమదనే ధోరణిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు పట్టుబట్టి, సుప్రీం కోర్టు వరకూ వెళ్లాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గతంలో ఎనిమిది సార్లు నిర్వహించిన సర్వేల ఆధారంగా గుర్తించిన హద్దులను మరోసారి పరిశీలించి రెండు రాష్ట్రాల భూభాగాన్ని గుర్తించనున్నారు.
పదేళ్ల సరిహద్దు వివాదం.. తీరిపోయే సమయం! - ఏపీ కర్ణాటక సరిహద్దు వివాదం తాజా వార్తలు
అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దుల గుర్తింపునకు యంత్రాంగం కదిలింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సర్వేఆఫ్ ఇండియా నిపుణులు, అధికారుల బృందం వివాదాస్పద సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు. కర్ణాటకలోని తోర్నగల్ జిందాల్ పరిశ్రమ సమావేశ మందిరంలో సర్వేఆఫ్ ఇండియా అధికారులు ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి.... అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలను పరిశీలించారు.

ఇరు రాష్ట్రాల మధ్య విభజన రేఖను సూచించే భూభాగం 17 కిలోమీటర్లు ఉందని సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిర్ధారించారు. అధికారుల బృందం డి.హీరేహాల్ మండలంలోని సిద్ధాపురం, ఓబులాపురం, మలపనగుడి గ్రామాల్లో పర్యటించించారు.. అక్రమ మైనింగ్ తో చొరబడిన ప్రాంతంలో కొన్ని హద్దు రాళ్లు గుర్తించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 17 కిలోమీటర్ల పొడవునా సరిహద్దులు పక్కాగా చేయనున్నారు. గతంలో అధికారులు వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం 110 హద్దు రాళ్లు వేయాలని నిర్ణయించగా, క్షేత్రస్థాయి తాజా పర్యటనతో 130 వరకు వేయాలని తేల్చారు. ఈ సర్వే, పిల్లర్ల నిర్మాణానికి రెండు నెలలు సమయం పడుతుందని సర్వే ఆఫ్ ఇండియా అధికారులు జిల్లా యంత్రాంగానికి తెలిపారు.
ఇదీ చదవండి:మొదట్లో అబ్బాయిలు సున్నితంగా ఉండి... తర్వాత ముసుగు తొలగిస్తారు