అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం కూచివారిపల్లి గ్రామానికి చెందిన చక్రపాణి మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. చేసిన అప్పులు పెరిగిపోవటంతో తిప్పలు మొదలయ్యాయి. ఒళ్లొంచి పనిచేయటానికి బద్ధకించే చక్రపాణి.. ఈజీగా మనీ సంపాదించాలని డిసైడయ్యాడు. అందుకు ఓ స్నేహితుడి సలహా మేరకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి బ్లాక్‌మెయిలర్ అవతారమెత్తాడు. గతంలో తన తల్లికి, అత్తకు వైద్యం చేసిన కుమార్ అనే డాక్టర్‌ను బెదిరించి డబ్బు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకు తగ్గట్లుగా సినీఫక్కీలో మాస్టర్ ప్లాన్ రూపొందించాడు.
"బెంగళూరు హైవే పక్కన ఉన్న అశోక్ లేలాండ్ షో రూం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రూ. 20 లక్షల పడేసి వెళ్లాలి. నేనడిగిన డబ్బు ఇవ్వకపోతే నీ ప్రాణాలు దక్కవు. నిన్న చంపేస్తా. ఒంటరిగా వచ్చి డబ్బు అక్కడ పెట్టి వెళ్లాలి. ఈ విషయం పోలీసులకు చెబితే కాల్చి పడేస్తా" అంటూ లెటర్లు రాసి తన ద్విచక్రవాహనంలో పెట్టుకున్నాడు. బక్కరాయసముద్రం వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు చక్రపాణి అనుమానాస్పద రీతిలో ఎదురయ్యాడు. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ద్విచక్రవాహనంలో 5 బెదిరింపు లేఖలు బయటపడ్డాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.