satyakumar press meet : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం దొంగ ఓట్లను సృష్టిస్తోందని, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. టీడీపీ తీసుకువచ్చిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకం అక్షర సత్యమని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధిపై చర్చ అవసరం..రాష్ట్రంలో జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంశాలపై అనంతపురంలోని భాజపా నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆలోచనతో దొంగ ఓట్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగనాసుర రక్త చరిత్ర అంటూ ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన పుస్తకంలో నిజం ఉందన్నారు. రాష్ట్రంలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం తప్ప అభివృద్ధిపై చర్చ జరగడం లేదని గుర్తు చేశారు.
అన్నింటా విఫలం... జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు అన్నింటిలోనూ వైఫల్యం చెందారని చెప్పారు. జీతాల విషయంలో ఉద్యోగులు ఈ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న నమ్మకద్రోహానికి ఈసారి ఓట్లు పడే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో గెలవడానికి దొంగ ఓట్ల పరిశ్రమను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
కేంద్రం లక్షల కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తోంది. రైల్వే, రోడ్లు, హైడ్రోజన్, సోలార్ పార్కులు ఏర్పాటు చేస్తోంది. అభివృద్ధిపై చర్చ జరగాల్సిన తరుణంలో విషయం పక్కదారి పడుతోంది. మార్చి 13వ తేదీన జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్షరాస్యులంతా ఆలోచించి ఓటు వేయాలి. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురమ్మంటే... దొంగ ఓట్లను తయారు చేసే పరిశ్రమలు తెస్తోంది. ఆయా అంశాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం. - సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
ఇవీ చదవండి :