GVL On YSRCP Govt: ప్రజాధనం దుబారా, నచ్చని వారిపై కక్ష సాధింపు మినహా రెండున్నరేళ్ల వైకాపా పాలనలో సీఎం జగన్ చేసిందేమీ లేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా కదిరిలో నిర్వహించిన భాజపా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతూ.. ప్రచార ఆర్భాటాలతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ కేంద్ర నిధులతోనే అని జీవీఎల్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ చేయనంత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేస్తోందన్న విషయాన్ని జగన్ సర్కార్ గుర్తించాలన్నారు.
భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని జీవీఎల్ సూచించారు. రాబోయే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలపై సమన్వయ కమిటీలో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అధికారపార్టీ వైఫల్యాలపై, కేంద్రం అందిస్తున్న సాయాన్ని పక్కదారి పట్టిస్తున్న రాష్ట్రప్రభుత్వం తీరుపైనా చర్చించామన్నారు.