YSCRP Leaders Attacked On Army Jawan : దేశాన్ని కాపాడే ఓ ఆర్మీ జవాన్‌పై వైఎస్సార్సీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. పంట పొలాల్లో వెంటాడుతూ, జవాన్‌పై దుర్భాషలాడుతూ కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతను వైఎస్సార్సీపీ నాయకులు నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఈ విషయంపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. తాజాగా బీజేపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్య నారాయణ జవాన్‌ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
అమిత్ షా దృష్టికి తీసుకెళ్తాం :శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో ఆర్మీ జవాన్ పై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. ఈ సంఘటనను అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సూర్య నారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి ఆర్మీ జవాన్ సమరసింహా రెడ్డి పై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారన్న విషయం తెలుసుకొని బుధవారం సాయంత్రం ఆసుపత్రిలో బాధితున్ని ఆయన పరామర్శించారు. దాడి జరిగిన సంఘటన మీద ఆరా తీశారు. అధైర్య పడవద్దని బీజేపీ మీకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
మా ప్రభుత్వం వచ్చాక కేసులు రీఓపెన్ చేస్తాం :ఈ సందర్భంగా సూర్య నారాయణ మాట్లాడుతూ ధర్మవరంలో గత నాలుగు సంవత్సరాలుగా రౌడీ రాజ్యం నడుస్తుందని, ఇక్కడ ఎవరేం మాట్లాడినా, ప్రశ్నించినా దాడులు చేస్తారు లేదా చంపుతారని అన్నారు. ఒక ఆర్మీ జవాన్‌కు కూడా ధర్మవరంలో రక్షణ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయని అయితే వారు ఏదో విధంగా కేసులు నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ రీఓపెన్ చేస్తామని, ఎవరిని వదిలి పెట్టే పరిస్థితి లేదని సూర్య నారాయణ అన్నారు.