విభజనతో రాష్ట్రానికి నష్టం జరిగితే.. జిల్లాల పునర్విభజనతో ఇంకా ఎక్కువ BJP Leader Nallari Kiran Kumar Reddy Fires on YCP: రాష్ట్ర పునర్విభజనతో జరిగిన నష్టం కంటే ఈ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్విభజనతో ఎక్కువ నష్టం జరిగిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తైన సందర్భంగా అనంతపురంలో బీజేపీ మహా సంపర్క్ అభియాన్ బహిరంగ సభ నిర్వహించారు. దీనికికిరణ్కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంచే నిర్ణయం జరిగిందన్నారు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసి తాను అప్పట్లో తెచ్చిన స్టే నేటికీ కొనసాగుతోందని కిరణ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలు.. మిగులు జలాలపై తాను వేసిన సుప్రీంకోర్టు కేసును పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఇదే ధోరణిలో ఉంటే కేసు ఓడిపోయి, ఆర్డర్ నోటిఫై అయితే తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కృష్ణా మిగులు జలాలతో తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల ఎకరాలు సాగవుతోందని.. ఆ విషయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తించాలని సూచించారు.
"విభజన వల్ల మనకు తీరని నష్టం జరిగింది. మన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిపాలకులు బాగుంటే కష్టాలను కూడా అధిగమించవచ్చు. తొమ్మిది సంవత్సరాల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిలో ఉన్నాము. దీని వల్ల లాభం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంకోటి జిల్లాల విభజన. జిల్లాలను ఇష్టం వచ్చినట్లు విభజన చేశారు. ఏవిధంగా అయితే విభజన వల్ల నష్టోపోయామో.. ఈ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్విభజన వల్ల కూడా అంతకంటే ఎక్కువే నష్టపోయాము. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో విశాఖ ఎంపీ కుటుంబ కిడ్నాప్ విషయంలోనే అర్థమవుతోంది. ప్రతీ గ్రామంలో కూడా అవినీతి, అరాచకాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి."-నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, బీజేపీ నేత
మోదీ మేలు చేస్తే.. జగన్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు: ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్అన్నారు. ప్రధాని మోదీ మిల్లెట్ ఇయర్‌గా తీసుకున్న నిర్ణయం రాయలసీమ జిల్లాల రైతులకు చాలా మేలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని, ప్రధాని ప్రజలకు మేలు చేస్తున్నారని ఆయన చెప్పారు. సీఎం జగన్ గజదొంగని.. రాష్ట్రాన్ని దోచేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ రాష్ట్రానికి బంగారు ఉంగరం ఇస్తే, జగన్ మోహన్ రెడ్డి ఇనుప ఉంగరం కోసం వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు.