జగన్ ప్రభుత్వం పదిహేడు నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని భాజపా నేత కసిరెడ్డి వజ్ర భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నాయకులు సమావేశమయ్యారు. 'రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసిన ప్రభుత్వం, నవరత్నాల హామీలకు అప్పులు చేస్తూ నెట్టుకొస్తోంది' అని విమర్శించారు. కేంద్ర ప్రవేశ పెట్టిన పథకాల పేర్లు మార్చి, రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
'రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది' - అనంతపురం తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా నేత కసిరెడ్డి వజ్ర భాస్కర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని అనంతపురం జిల్లా కదిరిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు.
స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై భాజపా నాయకులు విమర్శలు గుప్పించారు. సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిన శాసనసభ్యుడు, సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సౌర విద్యుత్తు ప్రాజెక్టులో, కొత్తగా మంజూరైన రహదారుల నిర్మాణంలో గుత్తేదారులను బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రతి పనిలోనూ వాటాను డిమాండ్ చేస్తున్నారంటూ విమర్శించారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి బెదిరింపులపై 479 ఫిర్యాదులు అందాయని వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్థానిక శాసనసభ్యుడిని దారిలో పెట్టాలని సూచించారు. లేని పక్షంలో ఎమ్మెల్యే అవినీతిపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.