AP BJP President Somu Veerraju Fires On YSRCP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను దోపిడీ కేంద్రాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు సివిల్ సప్లయ్ అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర దక్కకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సామాన్యులు తినని బియ్యాన్ని మిల్లర్లు అందిస్తున్నారని.. ప్రభుత్వం కళ్లు మూసుకున్నట్లుగా వ్యవహరిస్తోందని సోము వీర్రాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో అధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతులను ఆదుకోవటానికి కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదన్నారు. దళారులతో మిల్లర్ల వ్యవస్థ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని.. సివిల్ సప్లయ్ అధికారులు ఇదంతా చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపించారు.
రైతులకు గోనె సంచులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ధాన్యం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవ్వటం లేదని సోము వీర్రాజు అన్నారు. సివిల్ సప్లయ్ అధికారులు, మిల్లర్లు కలిసి రైతులను, సామాన్య ప్రజలను దోచుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఓ మిల్లు యాజమానిని.. సివిల్ సప్లయ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నియమించటం దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. దోపిడీకి ఇదే ప్రధాన కారణమన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సమగ్ర శిక్షా అభియాన్‌లో తరగతి గదుల నిర్మాణంతోపాటు ఇతర సౌకర్యాల కోసం.. కేంద్రం ఇచ్చిన 30 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.