హిందూ ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని.. భాజపా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం అల్లుగుండు శివాలయం భూమిలో గ్రామ సచివాలయం నిర్మించడాన్ని భాజపా, విశ్వహిందూ పరిషత్ నాయకులు అడ్డుకున్నారు. పురాతన దేవాలయ ఆనవాళ్లు తొలగించాలనే ఆలోచనను అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకున్న భాజపా, వీహెచ్పీ - అల్లుగుండులో గ్రామ సచివాలయం నిర్మాణంపై నిరసనలు
దేవాలయాల భూములను గ్రామ సచివాలయ నిర్మాణం కోసం వినియోగించడంపై.. భాజపా, విశ్వ హిందూ పరిషత్ నాయకులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం అల్లుగుండులోని పాత శివాలయానికి చెందిన స్థలంలో.. నిర్మాణాలు చేపట్టడాన్ని అడ్డుకున్నారు.
![ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకున్న భాజపా, వీహెచ్పీ bjp vhp protest for temple lands](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9476339-440-9476339-1604829074984.jpg)
శివాలయానికి చెందిన 56 సెంట్ల భూమిలో.. దేవాలయ పునర్నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని భాజపా నేతలు పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని వజ్ర భాస్కర్ రెడ్డి.. దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని వీహెచ్పీ నాయకులు మండిపడ్డారు. సచివాలయ నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చిన ప్రదేశంలో కాషాయ స్తంభాలు నాటారు.
ఇదీ చదవండి:అప్పులు చేసి పునాదులు వేసుకున్నాం... మాకు న్యాయం చేయండి