వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా.. భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని కళ్యాణదుర్గంలో తలపెట్టిన రాస్తారోకో కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా.. వ్యాపారులు దుకాణదారులు స్వచ్ఛందంగా మూసివేశారు. సీపీఐ నేతలు రాస్తారోకో నిర్వహించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం సీపీఐ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉరవకొండలో
ఉరవకొండ మండలంలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని వారు కోరారు.
సీపీఎం నాయకుల ఆందోళన
అనంతపురం నగరంలో ఓ హోటల్ యజమానిపై.. సీపీఎం, సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ బంద్‌లో భాగంగా దుకాణాలను మూసి వేయాలని తెలిపినా.. బస్టాండ్ సమీపంలో ఉన్న హోటల్ తెరవడంతో నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. హోటల్ మూసివేయాలని యజమానిని ఆదేశించగా.. హోటల్‌ను మూసివేశారు.