ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో ప్రశాంతంగా ముగిసిన బంద్ - అనంతపురంలో బంద్ తాజా సమాచారం

దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ అనంతపురంలో ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు, వ్యాపారులు రైతులకు మద్దతు తెలిపారు. ఉదయాన్నే వామపక్ష పార్టీల నేతలు బస్టాండు వద్దకు చేరుకొని రైతులకు జరుగుతున్న అన్యాయంపై, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నల్ల చట్టాల గురించి రైతులు మాట్లాడుతుంటే వారిని చులకనగా చూస్తారా అంటూ వామపక్షపార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

bandh continues under left parties
అనంతపురంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

By

Published : Dec 8, 2020, 9:58 AM IST

Updated : Dec 8, 2020, 8:27 PM IST

అనంతపురం జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతగా ముగిసింది. వ్యాపారులు, దుకాణాలు మూసివేసి అన్నదాతలకు మద్దతుగా నిలిచారు. జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిరసనకారులు రోడ్డుపై కూర్చొని అల్పాహారం స్వీకరించి, రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దుచేయాలని సీపీఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. దేశ ప్రజల ఆకలి తీరుస్తున్న అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోవటం లేదని ఆరోపించారు. దేశంలో ఆహార ధాన్యాలను కార్పొరేట్ సంస్థలు నిల్వ చేసుకునేలా చట్టాలు చేశారని, దీనివల్ల ప్రజలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. భాజపా అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి మందగించి దేశం తిరోగమనంలో ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు. కార్పొరేట్​లకు అనుకూలంగా నల్లచట్టాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలంతా ప్రతిఘటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కదిరిలో ప్రభుత్వ ఆదేశం మేరకు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేశారు. హిందూపురంలో వామపక్ష పార్టీలు తలపెట్టిన బంద్ ముగిసింది. ఆందోళనకారులు రోడ్లపైకి రానప్పటికీ స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేశారు. బంద్ ప్రభావంతో హిందూపురం ఆర్టీసీ డిపో పరిధిలో తిరుగుతున్న 54 ఎక్స్​ప్రెస్​ సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. రాయదుర్గంలోని వామపక్ష పార్టీలు వ్యాపార సంఘాలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్​కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాయదుర్గం డిపోలో 36 బస్సు సర్వీసులు రద్దు చేశారు. వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు బంద్​కు మద్దతు తెలిపాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

గుంతకల్లులో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో కాంగ్రెస్,వామపక్ష పార్టీలు, కార్మిక రైతు సంఘాల ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. గుంతకల్లులోని ప్రధాన మార్గాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంద్‌కు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రభుత్వం అనుమతివ్వడంతో వ్యాపార, వస్త్ర,దుకాణ యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.

ధర్మవరంలో భారత్ బంద్​కు మద్దతుగా వామపక్ష నేతలు నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా నిరసన ర్యాలీ చేశారు. బ్యాంకులు,వాణిజ్య సముదాయాలను మూసివేశారు.పెనుకొండ, సోమందేపల్లిలలో రైతులపై ఉన్న చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్షాలు బంద్ నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. దిల్లీలో రైతు సంఘాల నాయకులు భారత్ బంద్​కు పిలుపునివ్వడంతో అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఉరవకొండలో వామపక్షలు బంద్‌ను చేశారు. భారత్ బందులో భాగంగా కళ్యాణదుర్గంలో ఓ యువ కళాకారుడు తన పాటలతో ఆకట్టుకుంటూ రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపాడు. మడకశిర పట్టణంలో రాష్ట్ర పట్టు రైతు సంఘం అధ్యక్షుడు, రైతులు, వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ కూడలిలో మానవహారంగా ఏర్పడి బైఠాయించి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలని నినాదాలు చేశారు.

ఇదీ చదవండీ...

ఏపీలైవ్ అప్​డేట్స్ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్

Last Updated : Dec 8, 2020, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details