గుంటూరులో...
మున్సిపల్ ఎన్నికల్లో నూరు శాతం పోలింగ్ నమోదు చేయాలనే లక్ష్యంతో.. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ హాజరయ్యారు. ఓటు హక్కు వినియోగంపై స్థానికులకు, వాకర్లకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల సదుపాయాలు మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. ప్రజలు, యువత అందరూ ముందుకు వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. శుక్రవారం సాయంత్రానికి ఓటర్ స్లిప్పుల పంపిణీ ...30 శాతం పూర్తి అయ్యిందనీ.. ఆదివారం సాయంత్రంలోపు నూరు శాతం ఓటర్ల స్లిప్‌ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతపురంలో...
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పురపాలక ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని... మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ డీఎస్పీ రమాకాంత్ పాల్గొన్నారు. ఈనెల 10న జరిగే ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదు కావాలని.. మున్సిపల్ కమిషనర్ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
సీఐల ఆధ్వర్యంలో...
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనంతపురం నగరంలోని... నాలుగు పోలీస్ స్టేషన్ల సీఐలు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికలు ముగిసే వరకు.. పోలీసుల నిఘా ఉంటుందనీ.. ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలనీలు అభివృద్ధి చేసే నాయకులు ఓటు వెయ్యాలనీ.. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. గొడవలకు, అల్లర్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఇదీ చదవండి:ఉదయం ప్రతిపక్షంలో.. సాయంత్రానికి అధికార పార్టీలో..!