తనపై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదనే ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం జిల్లా పామిడి పోలీస్ స్టేషన్ ఎదుట రామాంజనేయులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతన్ని కాపాడే క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి. పామిడికి చెందిన రామాంజనేయులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మరో ఆటోడ్రైవర్ మహబూబ్ బాషా అకారణంగా అతనిపై దాడి చేశాడు. అయితే ఇదే విషయమై రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే....సాయంత్రం రా అని చెప్పి పంపించేశారు. తీరా సాయంత్రం వెళ్లాక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో మనస్తాపం చెంది పీఎస్ ఎదుటే నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న కానిస్టేబుళ్లు మంటలార్పి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పామిడి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం