భవనాల అన్వేషణలో అధికార బృందాలు
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ పరిధిగా కొత్త జిల్లా రూపకల్పనకు అధికారుల అన్వేషణ మొదలైంది. హిందూపురం పట్టణంలో కొత్త జిల్లాపై చర్చ జోరుగా సాగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. అనంతలోనూ హిందూపురం పార్లమెంట్ పరిధిగా కొత్త జిల్లా రూపకల్పనకు అధికారుల అన్వేషణ మొదలైంది. ఇందుకోసం ఏర్పాటైన రాష్ట్ర, జిల్లా కమిటీలు క్రమేణా చర్యలు వేగం పుంజుకొంటున్నాయి. కరోనాతో ఇప్పటి వరకు జిల్లా ఏర్పాటు ప్రక్రియ మందకొడిగా సాగినా.. కొన్ని రోజులుగా హిందూపురం, పెనుకొండ ప్రాంతాల్లో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తామని ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ప్రకటించింది. జనవరికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చన్న సూచనలతో.. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. హిందూపురం, పెనుకొండ ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. జిల్లాలో ఉద్యోగులు ఎంత మంది, ఏ ఏ హోదాల్లో పని చేస్తున్నారు. సొంత భవనాలు ఎన్ని శాఖలకు ఉన్నాయి, అద్దె భవనాల్లో ఎన్ని కార్యాలయాలు ఉన్నాయి, ఆయా శాఖలకు సంబంధించి ఎంత భూమి ఉంది. తదితర లెక్కలు తీస్తున్నారు. పోలీస్ శాఖ సైతం కొత్త జిల్లాలో తమ కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు సంబంధిత విభాగాల కార్యాలయాలు, మౌలిక వసతులు పరిశీలించి వెళ్లారు. లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం హిందూపురం పరిధిలోని 7 నియోజకవర్గాలతో కలిపి జిల్లా కేంద్రం చేస్తున్న నేపథ్యంలో పురంలోనే అందుకు అనువుగా కార్యాలయాలు ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. హిందూపురం పట్టణంలో కొత్త జిల్లాపై చర్చ జోరుగా సాగుతోంది.