అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఐడీ వార్డులో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఏం జరగకపోయినా అందర్నీ భయపెట్టింది. హుటాహుటిన మంటలు ఆర్పి పక్కనే ఉన్న కొవిడ్ రోగుల్ని వేరే వార్డుకు తరలించడంతో ముప్పు తప్పింది. ప్రమాదానికి గల కారణాలు అన్వేషించే క్రమంలో నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. అగ్నిప్రమాదం జరిగిన వార్డు భవనం 40 ఏళ్ల క్రితం నిర్మించింది కావడం వల్ల అప్పటి ఎలక్ట్రికల్ వైరింగ్ ఎక్కడికక్కడ ప్రమాదకరంగా వేలాడుతున్నాయని గుర్తించారు.
ఆసుపత్రిలో భారత వైద్యమండలి నిబంధనల ప్రకారం అన్ని వసతుల కల్పనకు రూ.20 కోట్లతో చేపట్టిన వివిధ పనులు రెండేళ్లుగా సాగుతున్నా ఇంకా అసంపూర్ణమే. ఇటీవలి ప్రమాదంతో అప్రమత్తమైన అధికారులు పాతకాలపు వైరింగ్‌ను మొత్తం మార్చడమే కాక విద్యుత్ లైన్లకు అడ్డమొచ్చే చెట్లను తొలగిస్తున్నారు.