స్థల వివాదంలో దళిత మహిళపై దాడి అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నక్కనదొడ్డి గ్రామంలో కొందరు వ్యక్తులు దళిత మహిళపై అమానుషంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామంలో వామిదొడ్డి స్థలం విషయంలో లక్ష్మిదేవి.. లింగమయ్య కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై ఈనెల 24న లక్ష్మిదేవిపై లింగమయ్య, అతని కుమారులు సురేష్, వెంకటేష్, శ్రీనివాసులు దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో.. గుంతకల్లు డీఎస్పీ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని.. బాధితులకు న్యాయం చేస్తామని డీఎస్పీ తెలిపారు
అధికార పార్టీ అండదండలతో..
తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో రోడ్డు వేసేందుకు యత్నిస్తుంటే ప్రశ్నించిన పాపానికి.. మహిళ అని చూడకుండా కాళ్లతో తన్ని.. ఇష్టం వచ్చినట్టు కొట్టారని.. గ్రామంలో ఉండాలంటే భయం వేస్తోందని బాధిత మహిళ వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దాడికి పాల్పడినవారు స్వేచ్ఛగా గ్రామంలో తిరుగుతున్నారని తెలిపింది. అధికార పార్టీ అండదండల కారణంగా పోలీసులు విషయాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి నింధితులు నలుగురిపై.. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ల చుట్టు తిరుగుతున్నప్పటికీ.. ఫలితం లేకపోవటంతో.. దాడికి సంబంధించిన దృశ్యాలను సామాజిక మద్యమాల్లో షేర్ చేసినట్లు వెల్లడించారు.
నలుగురు నిందితుల్లో సురేష్, వెంకటేష్, శ్రీనివాసులును అరెస్టు చేశామని.. లింగమయ్యను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు డీఎస్పీ షరువుద్దీన్తో పాటు సీఐ రియాజ్ అహ్మద్ బాషా, ఎస్ఐ ఖాజావలి పాల్గొన్నారు.
ఇవీ చూడండి...