తాజాగా త్రైమాసిక బడ్జెట్ పూర్తయింది.. ఏ పద్దు కింద మందులు ఇవ్వాలో తెలియని పరిస్థితిలో అనంతపురం జిల్లా కేంద్ర ఔషధ గోదాము(సీడీసీ) యంత్రాంగం ఉంది. కొన్ని రకాలు ‘స్థానిక కొనుగోలు’ (లోకల్ పర్చేజ్-ఎల్‌పీ) కింద తెస్తున్నా పూర్తి స్థాయిలో రోగులకు సరిపడటం లేదు. వారం రోజులుగా ఈ సమస్య ఉత్పన్నమైంది. ప్రస్తుతం తొలి త్రైమాసికం జూన్‌తో పూర్తవుతుంది. అప్పటిదాకా సర్దుబాటు చేయాలంటే కష్టమే. కొవిడ్ కింద అదనపు బడ్జెట్, మందులు ఇస్తేనే సమస్య తీరుతుంది. దీనిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కీలక ఔషధాల కొరత
కొవిడ్ రోగులకు డాక్సీసైక్లిన్ ఎంతో కీలకం. ఈ మాత్ర ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించనుంది. ప్రతి రోగికి ఆయాసం ఉంటోంది. తప్పనిసరిగా డెరోఫ్లిన్, డెక్కాడ్రాన్ వంటి సూది మందులు విధిగా వాడాలి. టాబోబాక్టమ్ సూది మందు కూడా కొవిడ్ రోగులకు కీలకమైనదే. కడుపులో మంటను తగ్గించే పాంటాప్రజోల్.. ఇలా కరోనా రోగులు నిత్యం వాడాల్సిన మందుల కొరత ఏర్పడింది. మూడు ఆస్పత్రులకు కలిపి ఒక్కో మందు రోజూ 3 వేల నుంచి 4 వేలు దాకా ఖర్చు అవుతున్నాయి. మరో 300 పడకలతో జర్మనీ హ్యాంగర్స్‌తో తాత్కాలిక ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. దీనికి కూడా సర్వజనాస్పత్రి మందులే వాడనున్నారు. వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి.. సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉంది.
ఆ రెండు ఆస్పత్రులు అదనం
వార్షిక బడ్జెట్ కేవలం సర్వజనాస్పత్రి రోగులకు మాత్రమే. కానీ కొవిడ్ రోగులు అమాంతం పెరిగారు. మరోవైపు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆస్పత్రిలోనూ 500పైగా బాధితులు వైద్య చికిత్స పొందుతున్నారు. వీరికి కూడా పెద్దాస్పత్రి బడ్జెట్ నుంచే మందులు సరఫరా చేస్తున్నారు. అదనపు బడ్జెట్ రాలేదు. ఫలితంగా మూడు నెలల మందులు నెలన్నరకే సరిపోతున్నాయి.
ఆస్పత్రికి వార్షిక మందుల బడ్జెట్ రూ.7.4 కోట్లు. త్రైమాసికానికి (క్వార్టర్) రూ.1.8 కోట్లు. ఒక్క సర్వజనాస్పత్రికే ఈ బడ్జెట్. ప్రస్తుతం ఈ బడ్జెట్‌నే సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆస్పత్రి రోగులకు కూడా వాడుతున్నారు. దీంతో మూడు మాసాలు రావాల్సిన మందులు నెలన్నరకే పూర్తయ్యాయి. మరో 40 రోజులు ఎలా నెట్టుకురావాలో దిక్కుతోచని పరిస్థితి.