లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడమే కాదు.. అత్యవసర సమయాల్లో సాయం కూడా అదే స్థాయిలో చేస్తామని నిరూపించారు.. అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఏఎస్ఐ. ప్రసవవేదనతో అల్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు సకాలంలో వైద్య సేవలు అందేలా చేసి తన విధి నిర్వహణనే కాదు.. మానవత్వాన్ని చాటుకున్నారు.. ఏఎస్ఐ నాగభూషణం. బత్తలపల్లి మండలం యర్రాయపల్లి గ్రామానికి చెందిన నెలలు నిండిన గర్భిణీ కళావతిని ప్రసవం కోసం ఆటోలో అనంతపురం తీసుకొస్తున్నారు. మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో రాప్తాడు సమీపంలో ఆగిపోయారు. లాక్డౌన్ కారణంగా చుట్టూ ఎవరూ లేని పరిస్థితి. అక్కడే విధుల్లో ఉన్న ఏఎస్ఐ నాగభూషణం దీనిని గమనించిన వెంటనే స్పందించారు. రాప్తాడు బస్ స్టాప్ లో వారిని ఉంచి.. స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీ వైద్యున్ని, ఆయా లక్ష్మీదేవిని పిలిపించారు. స్థానిక ప్రజల సహకారంతో అక్కడే ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. కళావతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఏఎస్ఐ నాగభూషణం 108కి సమాచారం అందించారు. ప్రసవం పూర్తయ్యే సమయానికి ఆంబులెన్స్ కూడా వచ్చేసింది. తర్వాత ఇద్దర్నీ అనంతపురం తరలించారు. కరోనా విజృంభించి ఒక మనిషిని తాకాలంటేనే భయపడుతున్న సమయంలో ఏఎస్ఐ నాగభూషణం ఎంతో బాధ్యతతో వ్యవహరించారు. తన సొంత వారిగా భావించి రెండు నిండు ప్రాణాలను కాపాడారని మహిళ కుటుంబ సభ్యులు ఏఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఖాకీ మనస్సెంతో చల్లన! - గర్భణీకి సాయం చేసిన ఏఎస్పీ వార్తలు
నిండు గర్భిణీ ప్రసవం కోసం ఆసుత్రికి ఆటోలో తరలిస్తున్నారు. మార్గమధ్యలోనే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. లాక్డౌన్ ప్రభావంతో చుట్టుపక్కలు ఎవ్వరూ లేరు.. దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు... ప్రసవ వేదనతో అల్లాడుతున్న మహిళ కష్టాన్ని చూసి ఆ ఏఎస్సై చలించిపోయారు. సుఖ ప్రసవం అయ్యేందుకు ఏర్పాట్లు చేసి.. పోలీసులు అంటే కాఠిన్యమే కాదు కరుణ సైతం ఉంటుందని నిరూపించారు.
ఈ ఖాకీ మనస్సెంతో చల్లన!