అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. అనంతపురం జిల్లాలో రైతులు దాదాపు ఏటా అనుభవించే పరిస్థితులివి..! సాగుకు అవసరమైనప్పుడు నీరు దొరకవు. అవన్నీ అధిగమించి విత్తనమేస్తే...ఇలా గాలివానతో అతివృష్టి.! ఇలా ఎటువెళ్లినా అనంత రైతును ప్రకృతి విపత్తులు వెండాడుతున్నాయి. గతేడాది అధిక వర్షాలతో జరిగిన నష్టం నుంచి కోలుకోకముందే...అన్నదాతలను అసని తుపాను ముంచేసింది.
అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి... ఇదీ అక్కడి అన్నదాతల పరిస్థితి - అనంతపురం జిల్లాలో అన్నదాతల వార్తలు
గతేడాది వరదల నుంచే ఆ రైతులు ఇంకా కోలుకోలేదు. అరకొర ఆశలతోనే సాగుబడిలో ముందుకు సాగారు. అసని తుపాను వారి ఆశలను అడియాశలు చేసింది. పంట నిటారుగా నిలబడి దిగుబడినిచ్చేలోపే... తుపాను పడగొట్టేసింది. అనంతపురం జిల్లాలో వందల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

ఏటా తొలకరి జల్లులు మొదలయ్యే సమయంలో రైతులకు కొద్దిమేర నష్టం జరిగేది. ఐతే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేలోపే అన్నదాతలు దాదాపు అన్ని పంటలనూ కోసి మార్కెట్‌కు తరలించేవారు. ఈసారి హఠాత్తుగా విరుచుకుపడిన అసని తుపాను ఉద్యాన పంటలకు అపార నష్టం మిగిల్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభావం కాస్త తక్కువగానే ఉన్నా అనంతపురం జిల్లా ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, బుక్కరాయసముద్రం, నార్పల, కళ్యాణదుర్గం పరిధిలో.. అరటి రైతులు సర్వం కోల్పోయారు. పంట నష్టం అంచనాలు ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలంటూ..ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వంద హెక్టార్లలో..ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు.
ఇదీ చదవండి:Asani Cyclone: అసని తుపాను.. అసలేం మిగలలేదంటున్న అన్నదాతలు