అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటా వేలాది సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అవాంతారాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో.. వైరస్ ప్రబలకుండా ముందస్తుగా పలు జాగ్రత్తలు చేశామని అధికారులు తెలిపారు.
పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం గుంతకల్లు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈసంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున 60 ఏళ్లకు పైబడిన వృద్ధులతో పాటు,10 సంవత్సరాలోపు ఉన్న చిన్న పిల్లలు ఎవరు కూడా ఈ ఉత్సవాలకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి గంటకు క్యూ లైన్లలో శానిటేషన్ చేస్తామని.. విధిగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని చెప్పారు.