రాష్ట్రంలో భూముల రీసర్వేకు సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించనున్న ఈ ప్రక్రియకు నిపుణులను అన్నివిధాలా సిద్ధం చేశారు. తొలిదశలో ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాలను రీసర్వేకు ఎంపిక చేసుకుని, సమస్యలను పరిష్కరిస్తూ రెండో దశలో మిగిలిన గ్రామాల్లో ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. రీ సెటిల్మెంట్ రిజిస్టర్- ఆర్ఎస్ఆర్ను ప్రామాణికంగా తీసుకొని శాటిలైట్ సాయంతో, డ్రోన్ల ద్వారా భూముల సరిహద్దులు గుర్తించనున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో శాటిలైట్ ద్వారా రెండు బేస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఓ కాంక్రీట్ పిల్లర్‌ను శాశ్వత నిర్మాణంగా ఏర్పాటు చేసి గుర్తుగా పెడతారు. భవిష్యత్‌లో ఈ బేస్ స్టేషన్ హద్దునే ప్రామాణికంగా తీసుకొని గ్రామాల్లో భూ కమతాల సరిహద్దులు నిర్ణయించనున్నారు.
భూముల రీసర్వేకు వేగంగా సన్నాహాలు - and resurvey in ap updates
జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలో ప్రారంభమయ్యే భూముల రీసర్వే కోసం సర్వేయర్లకు శిక్షణ పూర్తయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్లు, డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహణకు సర్వే ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. అనంతపురం జిల్లాలో తొలిదశ రీసర్వేకు 321 గ్రామాలను ఎంపిక చేశారు.
అనంతపురం జిల్లాలో తొలిదశలో 63 మండలాల్లోని 321 గ్రామాలను రీసర్వేకు ఎంపిక చేశారు. ఇప్పటికే భూరికార్డుల నవీకరణ జరిగిన గ్రామాలనే రీసర్వేకు ఎంపికచేసి, పది చోట్ల బేస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సర్వే సమయంలో రైతుల మధ్య తలెత్తే రహదారి, సరిహద్దు వివాదాలను ఎక్కడికక్కడ పరిష్కరించటానికి తహసీల్దార్ న్యాయనిర్ణేతగా ప్రతి మండలంలో సంచార న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రికార్డుల నవీకరణకు ముందు వెబ్ ల్యాండ్‌లో 70 వేల ఎకరాలు భూమి అధికంగా చూపింది. మూడు విడతలుగా రికార్డులను నవీకరించాక.. అది 30 వేల ఎకరాలకు తగ్గింది. వాటిలో 90 శాతం వరకు కోర్టు వివాదాల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గ్రామాల్లో భూమి కొలతల నిర్వహణకు సర్వేయర్ల కేటాయింపు, పరికరాలు సమకూర్చటంలో రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు తలమునకలై ఉన్నారు.
ఇదీ చదవండి: అమరావతి రైతుల పోరాటం వృథా కాదు: చంద్రబాబు