Anantapur District Panch Linga Temple: అరుదైన శిల్ప కళా సంపదను, ఆలయాలను కాపాడుతామని పురావస్తు శాఖ అధికారులు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూరు గ్రామ శివారులో ఉన్న పురాతన పంచ లింగ ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. గతంలో ఎంతో వెలుగు వెలిగి కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని నిరాదరణకు గురై అసాంఘిక కార్యకలాపాలకు నెలువుగా మారిన విషయాన్ని గతంలో ఈనాడు.. ఈటీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం పురావస్తు శాఖ పలు పురాతన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ పంచలింగ ఆలయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని వృద్దిలోకి తెస్తాం అని ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ పరిశోధకుడు రమేష్తో పాటు రాష్ట్ర సంచాలకురాలు రజిత పరిశీలించారు. ఆలయాన్ని పరిశీలించిన అధికారులు చోళుల కాలంలో నిర్మాణ శైలి చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడున్న నంది విగ్రహాలు ఎంతో అపురూపమైనవని.. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి ఆలయాన్ని పునరుద్ధరించి శిల్పకళా సంపదను కాపాడేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఈ సందర్భంగా పురావస్త శాఖ అధికారులు స్పష్టం చేశారు.