AR Constable Prakash Hunger Strike: పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ అనంతపురంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉదయం దీక్ష చేపట్టిన ప్రకాశ్‌ను రెండో పట్టణ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో 70 వేల మంది పోలీసులకు బకాయిలు రావాల్సి ఉందన్న ప్రకాశ్ వీటిని అడిగినందుకే తనను విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షకభటులంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారన్న ఆయన వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం ముందు ప్లకార్డుతో ప్రదర్శన:సీఎం జగన్ గతేడాది జూన్ 14న సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అనంతపురం పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్.. ‘సరెండర్ లీవులు, అదనపు సరెండర్‌ల లీవుల సొమ్ములు ఇప్పించండి.. సీఎం సార్ ప్లీజ్’ అన్న ప్లకార్డును ప్రదర్శించి నిరసన తెలిపారు. ఆ తర్వాత నుంచే అతనిపై వేధింపులు పెరిగాయని, ప్రతి కదలికపై నిఘా పెట్టారని ప్రకాశ్ సంబంధీకులు ఆరోపిస్తున్నారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని, పాత కేసుల్ని తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు.