ఉద్యోగం నుంచి తొలగించబడిన ఏఆర్ కానిస్టేబుల్ కేసులో సాక్ష్యం చెప్పిన లక్ష్మీ ఇంటి వద్ద ఆమె మాజీ భర్త హల్చల్ చేశాడు. లక్ష్మీ భర్త వేణుగోపాల్ రెడ్డి, అతని సోదరుడు నారాయణరెడ్డి గొడవకు దిగారు. భర్తతో తనకు సంబంధం లేదని, విడాకులు కూడా తీసుకున్నాని, కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా వచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు పోలీసులు మాత్రం... డయల్ 100కు ఫిర్యాదు రావడంతో వచ్చామని చెబుతున్నారు. విడాకులు తీసుకున్న నోటీసులను పోలీసులకు చూపించి గొడవ లేకుండా చూడాలని లక్ష్మీ కోరింది. గొడవ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ విషయంలో సాక్ష్యం చెప్పినప్పటి నుంచి పోలీసులు తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని మహిళ ఆరోపించింది.
ఇటీవల బాధితురాలు ఏం చెప్పారంటే:తనను బూచిగా చూపి అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగించారని ఆ కేసులో పోలీసులు ‘బాధితురాలు’గా పేర్కొన్న బి.లక్ష్మి తెలిపారు. ఈ ఏడాది జూన్ 14న శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన సభకు సీఎం జగన్మోహన్రెడ్డి హాజరుకాగా, తమ బకాయిలు చెల్లించాలంటూ అదేరోజు అనంతపురంలో ప్లకార్డులు ప్రదర్శించిన కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల్లోంచి తొలగించిన విషయం తెలిసిందే. గార్లదిన్నెకు చెందిన మహిళ నుంచి ప్రకాశ్ బంగారం, డబ్బు తీసుకున్నారనే అభియోగంపై అతన్ని డిస్మిస్ చేస్తున్నట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆదివారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులోని బాధితురాలు లక్ష్మి సోమవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ప్రకాశ్ తన నుంచి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టంచేశారు. కానిస్టేబుల్ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డం పెట్టుకుని ఆయనను డిస్మిస్ చేశారని వాపోయారు.