APSRTC Diesel Mafia in AP with Fake Bills:అనంతపురం జిల్లా గార్లదిన్నెలోని మణికంఠ కిసాన్ సేవాకేంద్ర పెట్రోల్ బంకు ఇచ్చిన రసీదు ఇది! ఎలాంటి వివరాల్లేని ఇలాంటి ఖాళీ బిల్లులతో డీజిల్ దొంగలు దందా సాగిస్తున్నారు! ఎన్ని లీటర్లు పోయించుకున్నారు?, ఏ తేదీన పోయించుకున్నారనే వివరాలు నింపడానికి వీళ్లకు వేరేలెక్కలుంటాయి. ఎందుకంటే అవన్నీ దొంగలెక్కలు! మణికంఠ కిసాన్ సేవాకేంద్ర పెట్రోలు బంకు ద్వారా ధర్మవరం ఆర్టీసీ డిపోకి గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కలిపి 3 లక్షల 88 వేల లీటర్ల డీజిల్ సరఫరా చేసినట్లు అధికారులు లెక్కచూపారు. కానీ ఆ బంకు యాజమాన్యం సదరు ఆయిల్ కంపెనీ నుంచి ఆ మూడు నెలల్లో కొన్నది లక్షా 26 వేల లీటర్ల డీజిల్ మాత్రమే. మిగతా 2లక్షల 62 వేల లీటర్లు డీజిల్ తెచ్చింది కర్ణాటక బంకు నుంచి చూపించింది ఏపీ బంకు లెక్కల్లో! కర్ణాటక సరిహద్దునున్న అనంతపురం జిల్లా ఆర్టీసీ డిపోల్లో ఇదో బహిరంగ దందా!
Diesel Buy in Karnataka and Supply to APSRTC Depots :గతంలో చమురు సంస్థల నుంచి నేరుగా ఆర్టీసీయే బల్క్‌గా డీజిల్ కొనేది. ఆర్టీసీకి సరఫరా సంస్థలు లీటర్‌పై 3 నుంచి 5 రూపాయల వరకూ తగ్గించి ఇస్తాయి. గతేడాది రిటైల్ బంకుల్లో ధర కంటే, బల్క్ ధర లీటర్‌కు 20 రూపాయల వరకూ పెరిగింది. అందుకే గత ఫిబ్రవరి నుంచి ఆర్టీసీ నేరుగా రిటైల్ బంకుల్లోనే డీజిల్ కొనింది. మళ్లీ బల్క్ ధర తగ్గేవరకూ అంటే ఈ యేడాది ఫిబ్రవరి వరకూ డీజిల్‌ను బంకుల్లోనే కొన్నారు. ఈ సమయంలోనే అక్రమార్కులు దందాకు తెరతీశారు.
ఏపీతో పోలిస్తే కర్ణాటకలో డీజిల్ ధర లీటర్‌కు 11 నుంచి 12 రూపాయలుతక్కువగా ఉంది. కొందరు బంకుల యజమానులు డీజిల్‌ను కర్ణాటకలో కొని, ఆర్టీసీ డిపోలకు సరఫరా చేశారు. బిల్లులు మాత్రం ఏపీలోని ఆయిల్ కంపెనీల నుంచే కొన్నట్లు సృష్టించారు. ఆర్టీసీ అధికారులూ ఈ బిల్లులను పరిశీలించకుండానే చెల్లించేశారు. ఏపీలోని ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్ కొంటేలీటర్‌కు 25 నుంచి 26 రూపాయల చొప్పున ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం దక్కుతుంది. కానీ.. కర్ణాటక నుంచి తేవడంతో మన ఖజానా కోట్ల రూపాయల్లో ఆదాయం కోల్పోయింది.
Diesel Magic at APSRTC Depots :కర్ణాటక సరిహద్దుల్లోని ఏపీఎస్ఆర్టీసీ డిపోలన్నింటిలో ఇలా లక్షలాది లీటర్ల డీజిల్ మాయాజాలం నడిచింది. హిందూపురంలోని పాండు రవి ఎంటర్‌ప్రైజెస్ పెట్రోల్ బంక్ నుంచి హిందూపురం ఆర్టీసీ డిపోకి గతేడాది ఆగస్టు నుంచి ఈ ఫిబ్రవరి వరకూ మొత్తం 12 లక్షల 38 వేల లీటర్ల డీజిల్ సరఫరా అయినట్లు ఆర్టీసీ లెక్కల్లో ఉంది. కానీ పాండురవి ఎంటర్ ప్రైజెస్ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఆయిల్ కంపెనీ నుంచి కొనిందే 2 లక్షల 12 వేల లీటర్లు. అంటే 10 లక్షల 26వేల లీటర్ల డీజిల్‌ను కర్ణాటకలో తక్కువ రేటుకు కొని, హిందూపురం ఆర్టీసీ డిపోకి సరఫరా చేశారు.