జగన్ నాయకత్వంలో మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. దిగజారుడు రాజకీయాలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి స్వార్థ రాజకీయాలకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సకాలంలో పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని.. అలాగే సంక్షేమ పథకాలు సైతం కోతలు విధించి దోచుకుంటున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
జగన్ తన సొంత ఆలోచనలతో అనుభవం లేని రాజకీయాలు చేస్తూ ప్రజలను సమస్యల్లోకి నెట్టారని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారులు సైతం రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయ పరిపక్వతను కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన సాగించే విధానాన్ని తెలుసుకోలేని రీతిలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని విమర్శించారు. కేంద్రంలో అన్నగా నరేంద్ర మోదీ, రాష్ట్రంలో తమ్ముడిగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వాల పాలనకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని డిమాండ్ చేశారు.